Sunday, January 19, 2025

బంగ్లాదేశ్ హిందువుల భద్రత ఎలా?

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత సమస్యను మిస్రి లేవనెత్తినా, ఢాకా బలమైన వాదనలను ముందుంచినట్లు తెలిపారు. ఇది మైనారిటీలపై దాడులు లేదా ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ దాస్ బెయిల్‌పై విడుదల ను అభ్యర్థిస్తున్న న్యాయవాదులను నిర్బంధించడం, చంపడం లేదా కొట్టి చంపడం వంటి అంశాలను ‘అంతర్గత’ వ్యవహారాలుగా పేర్కొనడం ద్వారా భారత్‌కు సంబంధం లేని విషయం అనే స్పష్టమై న సంకేతాలు ఇచ్చింది. ఒక విధంగా యూనస్ ముందు మిస్రి నిస్సహాయంగా తిరిగి వచ్చిన్నట్టు అర్ధం అవుతుంది. పాకిస్తాన్ అణచివేత నుండి దేశాన్ని విముక్తి చేయడంలో ముక్తి బాహినికి సహాయం చేయడంలో భారత దేశం పాత్ర గురించి మిస్రి స్పష్టంగా లేవనెత్తే ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించడం లేదు.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందువులపై, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు మొత్తం భారత్ ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు 1947 నుండి జరుగుతూ ఉన్నప్పటికీ మొదటిసారిగా మొత్తం ప్రపంచంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ విషయమై అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కూడా బంగ్లాదేశ్‌ను దుందుడుకుగా ప్రవర్తించడాన్ని ఖండించింది. చట్ట పాలనను కాపాడాల్సిన అవసరాన్ని, తగిన ప్రక్రియను, ప్రాథమిక హక్కులను గౌరవించాల్సిన అవసరాన్ని యూరోపియన్ యూనియన్ తాత్కాలిక ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. డిసెంబర్ 9న ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌తో జరిగిన గోష్టిలో బంగ్లాదేశ్‌కు యూరోపియన్ యూనియన్ రాయబారి, ప్రతినిధి బృందం అధిపతి మైఖేల్ మిల్లర్ ఈ పిలుపిచ్చారు.

కొద్ది రోజుల క్రితం ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై యుకె పార్లమెంట్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న క్రూరత్వాన్ని ప్రపంచం ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నది. వాస్తవానికి, 1947లో విభజన జరిగినప్పటి నుండి అక్కడ మైనారిటీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. వారి ఆస్తులను దోచుకున్నారు, మహిళలను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, బలవంతంగా భారత దేశానికి పారిపోవాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. 75 సంవత్సరాల నిరంతర హింస తర్వాత మొదటిసారి ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం మాత్రం దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నది. భారత విదేశాంగ విధానం కుప్పకూలిందా? అనే అనుమానం కలుగుతున్నది. విదేశాంగ మంత్రి పార్లమెంట్ ఉభయసభలలో ఓ ప్రకటన చేయడం మినహా ఈ విషయమై మన ఎంపిలు పార్లమెంట్ వేదికగా ఆగ్రవేశాలను వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేయలేదు.

1971లో దాదాపుగా మొత్తం ప్రపంచం భారత్‌కు వ్యతిరేకంగా నిలబడినా కేవలం నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎంతో సాహసోపేతంగా నాటి తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న దారుణమైన అణచివేతలు ఖండించారు. అంతేకాదు ప్రత్యక్ష జోక్యానికి తలపడ్డారు. గత 75 ఏళ్లలో భారత సైనికులు సాంకేతికంగా విజయం సాధించిన ఏకైక యుద్ధం అదే కావడం గమనార్హం. మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరచిన ఆ విజయానికి గుర్తుగా పాక్ సైనికులు భారత సైనికుల ముందు లొంగిపోతున్న చిత్రాన్ని భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుండి తొలగించడం ద్వారా నాటి సాహసోపేత నాయకత్వం గురించిన స్మృతులను చెరిపివేసే విచిత్రమైన ప్రయత్నాలను ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. అయితే, పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపు తప్పడం మన భద్రతకు సైతం ప్రమాదకారిగా మారుతున్నా భారత్ మౌనం వహిస్తున్నది. షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టే వరకు అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి భారత్ ఏమాత్రం అవగాహన లేకుండా ఉండటం మన దౌత్య, రక్షణ విధానాల ఘోర వైఫల్యాలకు నిదర్శనమే.

హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మొదటిసారిగా డిసెంబర్ 9న, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్, తాత్కాలిక ప్రధాన మంత్రి ముహమ్మద్ యూనస్‌లను కలవడంతో పరిస్థితులపై భారత్ ఆందోళనలను స్పష్టంగా వ్యక్తీకరిస్తారని ఆశించాము. బంగ్లాదేశ్‌తో ‘సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధం’ కోసం భారత్ విధానం పట్ల మిస్రి ఆశావాద స్వరాన్ని వినిపించినప్పటికీ, ఢాకా నుండి తగిన స్పందన కనిపించలేదు. దానితో ఆయన పర్యటన విఫలమిస్తోన్నట్లు స్పష్టం అవుతుంది. భారతదేశంలో హసీనాకు ఆశ్రయం కల్పించడం, తాత్కాలిక ప్రభుత్వం గురించి ఆమె చేసిన విమర్శనాత్మక ప్రకటనలకు సంబంధించిన ఉద్రిక్తతల నీడలో ఆయన జరిపిన చర్చలకు విలువ లేకుండా పోయింది.

ఢాకా విమానాశ్రయంలో మాట్లాడుతూ, మిస్రి ఈ చర్చలను నిష్కపటమైన, ఉత్పాదక సంభాషణకు అవకాశంగా అభివర్ణించారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనం కోసం ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ నిబద్ధతను నొక్కి చెప్పారు. అయితే, ఢాకా మీడియాలో వచ్చిన కథనాలు ఈ పర్యటన పట్ల ఆసక్తికరంగా లేవు. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వ్యాసంలో, ఈ అభివృద్ధి (సామూహిక తిరుగుబాటు) ముందు, ఒకటిన్నర దశాబ్దాలకు పైగా, భారత ప్రయోజనాలకు సేవ చేయడం కోసం న్యూఢిల్లీ ఒకే పార్టీపై, ఆచరణాత్మకంగా ఢాకాలో ఒకే జమీందార్ లాంటి దేశాధినేతపై ఆధారపడటం ద్వారా విదేశాంగ విధాన పజిల్‌ను అందించింది’ అంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఆ రచయిత తూర్పారబట్టారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత సమస్యను మిస్రి లేవనెత్తినా, ఢాకా బలమైన వాదనలను ముందుంచినట్లు తెలిపారు. ఇది మైనారిటీలపై దాడులు లేదా ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ దాస్ బెయిల్‌పై విడుదలను అభ్యర్థిస్తున్న న్యాయవాదులను నిర్బంధించడం, చంపడం లేదా కొట్టి చంపడం వంటి అంశాలను ‘అంతర్గత’ వ్యవహారాలుగా పేర్కొనడం ద్వారా భారత్‌కు సంబంధం లేని విషయం అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఒక విధంగా యూనస్ ముందు మిస్రి నిస్సహాయంగా తిరిగి వచ్చిన్నట్టు అర్ధం అవుతుంది.

పాకిస్తాన్ అణచివేత నుండి దేశాన్ని విముక్తి చేయడంలో ముక్తి బాహినికి సహాయం చేయడంలో భారత దేశం పాత్ర గురించి మిస్రి స్పష్టంగా లేవనెత్తే ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించడం లేదు. ఇటువంటి ప్రస్తావనలు దౌత్యపరమైన వ్యూహంలో భాగం కాగలవు. యూనస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని హసీనా ప్రకటనలు జారీ చేయడంపై ఢాకా ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా పరోక్షంగా భారత్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. యూనస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం జియాను చూసి మాత్రమే భయపడుతున్నారు. సత్వరం ఎన్నికలు జరపాలని ఆమె చేస్తున్న ఒత్తిడుల కారణంగానే మరో సంవత్సరం వరకు సాధ్యం కాకపోవచ్చని అంటూ సంజాయిషీ ఇచ్చుకునే రీతిలో స్పందించారు.

మొదటి నుండి షేక్ హసీనా భారత్‌కు మిత్రురాలు అనే భావనతో భారత ప్రభుత్వాలు బేగం జియాతో నామమాత్రపు సంబంధాలను సైతం ఏర్పర్చుకొనే ప్రయత్నాలు చేయలేదు. హసీనా ఆ దేశం నుండి నిష్క్రమించిన తర్వాత కూడా ఆమెతో సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నం చేయడం లేదు. నేడు బంగ్లాదేశ్‌లో భారత్ పట్ల సానుకూలంగా మాట్లాడేవారు లేని పరిస్థితి నెలకొంది. దౌత్యపరంగా, రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడం రెండు దేశాలకు సైతం అత్యవసరం. అయితే బంగ్లాదేశ్‌లో అటువంటి ఆదుర్దా ఉన్నట్లు కనిపించడం లేదు. వాణిజ్యం, కనెక్టివిటీ, విద్యుత్, నీరు, అభివృద్ధి సహకారం, కాన్సులర్ సహకారం, సాంస్కృతిక సహకారం వంటి అనేక సమస్యలు ఉన్నందున భారతదేశం సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఆసక్తి చూపుతున్నట్లు కనిస్తున్నది.

భారతదేశం, బంగ్లాదేశ్ బలమైన వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశం ఆసియాలో బంగ్లాదేశ్‌కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, దక్షిణాసియాలో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్‌తో టాటా మోటార్స్, విఐపి, ఇమామి, మారికో, డాబర్, ఆసియన్ పెయింట్స్, పిడిలైట్, అదానీ పవర్, హీరో మోటోకార్ప్ వంటి ముఖ్యమైన సంస్థలు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. బంగ్లాదేశ్‌కు భారతదేశం ఎగుమతులు గత ఐదు సంవత్సరాలలో 7.17 బిలియన్ల డాలర్ల నుండి 2022లో 13.8 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. భారతదేశం బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసే ప్రధాన ఉత్పత్తులు శుద్ధి చేసిన పెట్రోలియం, రిటైల్ కాని స్వచ్ఛమైన కాటన్ నూలు, ముడి పత్తి. అయితే, వ్యవసాయ ఎగుమతులు తగ్గడం, డిమాండ్ తగ్గడం వల్ల ఇటీవలి సంవత్సరాలలో ఎగుమతులు తగ్గాయి.గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ నుండి దిగుమతులు 2010-11లో 0.4-0.7 బిలియన్ డాలర్ల నుండి 2022- 23లో 2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

అయితే, ఇటీవలి సంవత్సరాలలో దిగుమతులు 1.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022 -23లో భారతదేశం బంగ్లాదేశ్ మధ్య మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం 15.9 బిలియన్లు డాలర్లు. చైనా బంగ్లాదేశ్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతీయ కంపెనీలు తమ వస్తువులను ఈశాన్య ప్రాంతాలకు పంపడానికి దగ్గర మార్గంగా బంగ్లాదేశ్ భూభాగాన్ని ఉపయోగిస్తాయి. గత ఆగస్టులో జరిగిన అలజడులతో బంగ్లాదేశ్ నుండి భారత దేశానికి రైలు సేవలను, అలాగే బస్సు, షిప్పింగ్ సేవలను నిరవధికంగా నిలిపివేయడం గురించి మిస్రి ఆందోళన చెందవచ్చు. బంగ్లాదేశ్‌తో భారత దేశపు సరుకు రవాణా కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. భారతదేశం నుండి ఆహార ధాన్యాలను తీసుకువెళ్ళే కొన్ని వ్యాగన్లు బంగ్లాదేశ్‌లో చిక్కుకున్నాయి. ఎనిమిది లోడ్ చేసిన రేక్‌లు భారత దేశంలో నిలిపివేశారు.

అయితే, భారతదేశానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే సేవలను తిరిగి ప్రారంభించడంలో బంగ్లాదేశ్ ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. మరోవంక, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా జోక్యం చేసుకొని, రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా అధికారులపై వదిలివేసి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. ఈ విషయమై భారత ప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని చివరకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా తన అసహనాన్ని వెల్లడి చేసింది. అయినా ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News