ఆగస్టులో విద్యార్థి సంఘాల నేతృత్వంలో ప్రజల తిరుగుబాటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన దరిమిలా భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. బంగ్లాదేశ్‌లోని హిందు మైనారిటీ సమాజంపై దాడుల ఆరోపణల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అవి భారత్‌లో పెద్ద పెట్టున నిరసనలకు దారి తీశాయి. వేలాది మంది హిందు సన్యాసులు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు వరకు పాదయాత్ర సాగించారు. హిందుత్వ వర్గాలు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
తుదకు టిఎంసి, బిఎస్‌పి వంటి పార్టీలు సైతం బంగ్లాదేశ్‌లో పరిస్థితుల నియంత్రణకు శాంతి పరిరక్షక దళాలను మోహరించవలసిందిగా ఐక్యరాజ్య సమితి (యుఎన్)ను కోరాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అగర్తలాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ కార్యాలయంపై దాడి తరువాత ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఆ దాడిని ‘తీవ్ర విచారకరం’ అని పేర్కొనడమే కాకుండా, దేశంలోని అన్ని బంగ్లాదేశ్ దౌత్యకార్యాలయాల వద్ద భద్రతను పెంచింది. ‘దారుణమైన దాడి’కి స్పందనగా భారత దౌత్యవేత్తను ఢాకా సమన్ చేసింది. రాజద్రోహం అభియోగాలపై ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు కూడా భారత్‌లో భారీ స్థాయిలో నిరసనలకు కారణమైంది. ఇస్కాన్‌గా పేర్కొనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఈయనను ఇటీవల బహిష్కరించింది. చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన తరువాత ఆయన మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఒక ముస్లిం ప్రాసిక్యూటర్‌ను నరికి చంపారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొత్త ఏమీకాదు. షేక్ హసీనా హయాంలో కూడా అవి జరిగాయి. ఉదాహరణకు, ఒక గుడిలో విగ్రహం పాదాల కింద ఖురాన్ ప్రతిని ఉంచిన వీడియో వైరల్ కాగా, అందుకు ప్రతిస్పందనగా 2021 అక్టోబర్ 13 నుంచి 19 వరకు దుర్గా పూజ ఉత్సవాల సమయంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందు వర్గాలపై మతపరమైన దౌర్జన్యకాండకు ముస్లిం మూకలు ప్రేరేపించాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 50పైగా ఆలయాలు, తాత్కాలిక పూజ వేదికలను ధ్వంసం చేశారు. అదే విధంగా భారత్‌లో మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై దాడులు, వేధింపు సంఘటనలు కొత్త కాదు. అయితే, భారత్‌లో బిజెపి పాలనలో అటువంటి సంఘటనలు మామూలుగా మారిపోయాయి.
పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదలివెళ్లవలసి వచ్చిన తరువాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా అతిపెద్ద మైనారిటీ సమాజమైన హిందువులను దాడులకు లక్షం చేసుకుంటున్నారన్నది వాస్తవం. బంగ్లాదేశ్‌లో విస్తృత సర్కులేషన్ గల బెంగాలీ దినపత్రిక ‘ప్రథమ్ అలో’ విలేకరులు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం, 2024 ఆగస్టు 5, 20 మధ్య 64 జిల్లాలు, 67 ఉపజిల్లాల వ్యాప్తంగా 49 జిల్లాల్లో మైనారిటీ సమాజంపై 1068 దాడులు సంభవించాయి.ఆ దాడుల్లో చాలా వరకు ఖుల్నా నైరుతి డివిజన్‌లో సంభవించాయి. అక్కడ మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం 295 ఇళ్లు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. వాటికి అదనంగా రంగ్‌పూర్‌లో 219, మైమెన్‌సింగ్‌లో 183, రాజ్‌షాహిలో 155, ఢాకా లో 79, బారిశాల్‌లో 68, ఛట్టోగ్రామ్‌లో 45, సిల్హెట్‌లో 25 కట్టడాలు ధ్వంసం అయ్యాయి. ఆ విధ్వంసం స్థాయి రకరకాలుగా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి గురి కాగా, ఇతర చోట్ల తక్కువగా దెబ్బ తిన్నాయి.
దౌర్జన్యకాండలో హిందు సమాజం సభ్యులు ఇద్దరిని హతమార్చారు. మొత్తం 912 దాడులకు సంబంధించిన సమాచారం వచ్చింది. వాటిలో కనీసం 506 కేసుల్లో బాధితులు అవామీ లీగ్‌కు అనుబంధితులు. హసీనా పతనానంతరం హిందువులపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ అంగీకరించారు. అయితే, అవి మతపరమైన ఉద్దేశంతో కాకుండా రాజకీయపరంగా జరిగినవని ఆయన అన్నారు. మైనారిటీ వ్యతిరేక హింసాకాండ ఉద్దేశపూర్వకంగా చేపట్టినట్టిది కాదని ఆయన పేర్కొన్నారు. ‘2006 నోబెల్ శాంతి బహుమత గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం సాగిందనేది సుస్పష్టం’ అని మధ్యంతర ప్రభుత్వాధినేత పత్రికా కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ అన్నారు.
‘వాస్తవ పరిస్థితి గ్రహించేందుకు’ బంగ్లాదేశ్‌కు భారతీయ మీడియాను తాము ఆహ్వానించామని, ‘కానీ వాస్తవంగా సమాచారం సేకరించే ఆసక్తి వారికి లేనట్లున్నది’ అని కూడా ఆలమ్ చెప్పారు. అయితే, ఆగస్టు 17న భారతీయ జర్నలిస్టుల యూనియన్ పంపిన లేఖకు బంగ్లాదేశ్ స్పందించలేదు. బంగ్లాదేశ్‌లో అసలు ఏమి జరుగుతోందో సమాచారం ఇవ్వడానికి అక్కడికి భారతీయ జర్నలిస్టులను పంపాలని తాము అనుకుంటున్నట్లు యూనియన్ ఆ లేఖలో తెలిపింది.
నవంబర్ 29న లోక్‌సభలో అరుణ్ కుమార్ సాగర్ స్టార్ గుర్తుతో వేసిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానం ఇస్తూ, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల ఘటనలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నదని వెల్లడించారు. ‘బంగ్లాదేశ్‌లో ఇటీవలి దుర్గా పూజ ఉత్సవాల సమయంలో ఆలయాలు, పూజా మండపాలపై దాడుల వార్తలు వెలుగులోకి వచ్చాయి. 2024 దుర్గా పూజ సమయంలో ఢాకా తంతిబజార్‌లో ఒక పూజా మండపంపై దాడి, సాత్‌ఖిరాలో జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ గురించి ప్రభుత్వం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది.
ఆ దాడుల దృష్టా బంగ్లాదేశ్ ప్రభుత్వం దుర్గా పూజ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చూసేందుకు ఆర్మీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మోహరింపుతో సహా ప్రత్యేక భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది’ అని ఆయన తెలిపారు. మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భారత ప్రభుత్వం సంతృప్తి చెందలేదని లోక్‌సభలో విదేశాంగ శాఖ మంత్రి సమాధానం సూచిస్తోంది. బంగ్లాదేశ్ పోలీసుల సమాచారం ప్రకారం, అక్టోబర్ 1 నుంచి బంగ్లాదేశ్‌లో దుర్గా పూజకు సంబంధించి 35 అవాంఛిత ఘటనలు జరిగాయి. 17 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. దాదాపు డజను కేసులు నమోదు చేశారు. అయితే, ఆ దాడులు మతపరమైన గుర్తింపు వల్ల ప్రేరేపితమైనవా లేక అవామీ లీగ్ ప్రభుత్వానికి సన్నిహితులైనవారిపై ఆగ్రహంతో జరిగినవా అన్నది ధ్రువీకరణ కాలేదు.
ఆ కేసుల్లో లక్షాలు చాలా వరకు అవామీ లీగ్ నేతలు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వారి రాజకీయ అనుబంధానికి మతపరమైన గుర్తింపు అంత ముఖ్యమైనదేమీ కాదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆ దాడులు మతపరమైనవి కావు. కానీ దేశంలో శాంతి భద్రతల సంక్షోభం నడుమ రాజకీయ ప్రతీకార చర్యలు లేదా సాధారణ క్రిమినల్ నేరాల మిశ్రమం. అయినప్సటికీ, హసీనా ప్రభుత్వ పతనానంతరం కొన్ని ఇస్లామిక్ ఛాందసవాద శక్తులు దేశంలో తిరిగి క్రియాశీలకం అవుతున్నట్లు కనిపిస్తోంది. అవామీ లీగ్ బద్ధ శత్రువైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి), దాని మిత్ర పక్షం జమాత్ ఎ ఇస్లామ్ రెండూ చారిత్రకంగా భారత్‌తో స్నేహపూర్వకమైనవి కావు. ఆ రెండు పార్టీలు బంగ్లాదేశ్‌లో ‘భారత్ నిష్క్రమణ’ ప్రచారోద్యమాన్ని ప్రేరేపించాయి. ఆ పరిణామాలన్నీ సహజంగానే దేశంలో మతపరమైన ఉద్రిక్తత తీవ్రతపై ప్రభావం చూపాయి. నోబెల్ గ్రహీత, సృజనాత్మక ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేస్తుందని మనం ఆశించగలం.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు సంబంధించి భారత మీడియాలో వస్తున్న వార్తలపై అతిశయోక్తులు ఉన్నాయన్నది నిజం. ఎందుకంటే వారి వార్తలు ప్రధానంగా భారత్‌కు పారిపోయిన అవామీ లీగ్ మద్దతుదారుల కథనాలపై లేదా నిర్ధారితం కాని సోషల్ మీడియా వర్గాల కథనాలపై ఆధారపడినవి. బిబిసిలోని వాస్తవ నిర్ధారణ విభాగమైన ‘బిబిసి వెరిఫై’ ఆ సోషల్ మీడియా పోస్ట్‌లను చాలా వాటిని దర్యాప్తు చేసింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తరువాత మైనారిటీలపై కొన్ని దాడులు జరగగా, పెక్కు వదంతులను కూడా ప్రచారం చేశారని దాని నివేదికలు వెల్లడించాయి. అటువంటి అతిశయోక్తుల మాట అటు ఉంచితే, హిందు సమాజం సభ్యులు అత్యాచారాలు ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.
వాటిలో చాలా కేసులు రాజకీయపరమైనవి. పూజ మందిరాల విధ్వంసం ఘటనలు, రాజకీయంగా తటస్థులపై దాడులు ఆ వార్తల్లో కొన్ని నిజాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి లేదా హిందువులపై దాడుల వదంతులు కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి. భారత్‌ల మైనారిటీలపై దాడుల గురించి ప్రధాన స్రవంతి భారతీయ మీడియాలో తక్కువగా వార్తలు వస్తున్నాయన్ననది కూడా నిజం. ఎందుకంటే, వాటిలో చాలా వరకు బిజెపి ప్రభుత్వం పట్ల సుముఖంగా ఉన్న బడా వాణిజ్య సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి.
బంగ్లాదేశ్ తక్షణ పొరుగు దేశంగా, బడా దేశంగా భారత్‌కు బంగ్లాదేశ్ అభివృద్ధిలోను, దాని భద్రతలోను సంబంధం ఉన్నది. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత్ కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ దానిని సదా అంగీకరిస్తుంటుంది.ఉభయ దేశాల మైత్రి ప్రభుత్వం మార్పుపై గాని, రెండు వైపుల మత కల్లోలాలపై గాని ఆధారపడరాదు. రెండు ప్రజాస్వామ్య దేశాలు తమ ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్టం చేసుకుని, ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలతో సాఫీగా ప్రజాస్వామిక కార్యకలాపాలను పంచుకుంటే మనం చేయి చేయి కలిపి ముందుకు సాగగలుగుతాం.
ఈశాన్యోపనిషత్
గీతార్థ పాఠక్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)