Tuesday, December 24, 2024

ఆ నలుగురు ఎవరు?

- Advertisement -
- Advertisement -

భారత పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాద దుండగులా లేక అదే పార్లమెంటు చేస్తున్న నల్లచట్టాలు ఆపడానికి భగత్ సింగ్ ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారులా! ఎవరు ఆ నలుగురు? కర్నాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ప్రతాప్ సింహ అలియాస్ సాగర్‌శర్మ, మనోరంజన్, మహారాష్ట్ర లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే, హర్యానాకు చెందిన నీలం. వీరు నలుగురు కర్నాటక కు చెందిన బిజెపి ఎంపి సిఫారసు లేఖలతో పార్లమెంటు విజిటింగ్ గ్యాలరీలో ప్రవేశించి వారి వ్యూహాన్ని అమలు జరిపారు. ఇద్దరు యువకులు గ్యాలరీ నుండి పార్లమెంటులోనికి బూట్లలో దాచిన క్యానిష్టర్ల ద్వారా పార్లమెంటులో వదిలారు! ఈ సంఘటన ఏమి నిర్ధారిస్తుంది? అత్యున్నత పాలనా చిహ్నమైన పార్లమెంటు భద్రత డొల్ల అని నిర్ధారణ అయింది. 2001లో పార్లమెంటు మీద దాడి జరిగిన రోజే ఈ సంఘటన జరగడం యాదృచ్చికమా లేక కుట్ర కోణమా అన్న అనుమానం రాకపోదు! అయితే పార్లమెంటులో జరిగిన ఈ సంఘటన, పార్లమెంటు పై దాడి జరిగిన రోజు కావడం కూడా మన భద్రతా ప్రమాణాలుపై అనుమానం రాక మానదు! అయితే సంఘటన జరిగిన వెంటనే మీడియా ఆ నలుగురినీ దుండగులుగా చిత్రీకరణ చేసి ప్రచారం చేశాయి.

నిజంగా వారు వ్యూహాత్మకంగా చేసిన దాడా లేదా నిరసన ఏదైనా కానివ్వండి వారు హాని చేయాలనే లక్ష్యంతో లేరని అర్థం అవుతున్నది? భగత్ సింగ్ తరహాలో యువకులు క్యానిష్టర్లలో కలర్ స్మోక్‌లు ద్వారా పార్లమెంటు నిండు సభలో దూకి వదిలారు. భగత్ సింగ్‌ను మనం త్యాగశీలిగా కీర్తిస్తారు! మరి వీరిని దుండగులుగా ప్రచారం చేస్తున్నాం. పార్లమెంటుపై దాడిని నేను సమర్థించను కానీ, భగత్ సింగ్‌ను పోలిన స్మోక్ బాంబును వీరు కూడా వినియోగించడం, దాడి చేసిన యువకులు భారత్ మాతా కీ జై అనే నినాదాలతో పాటు మణిపూర్‌లో మహిళలపై హింసను ఖండిస్తూ, పార్లమెంటులో నల్లచట్టాలను నిరసిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాలని, నియంతృత్వం నశించాలి అనే నినాదాలు ఇవ్వడం చూస్తే వీళ్ళు దుండగులు కారు, తీవ్రమైన పోరాట రూపం తీసుకున్న యువకులు అని అర్థం అవుతుంది. అయితే ప్రచారం కోసమే అయితే ప్రాణాలకు తెగించి ఇంత తీవ్రమైన వ్యూహం యువకులు ఎన్నుకుంటారా? వీరికి పార్లమెంటు ప్రవేశం కోసం ప్రతాప్ సింహ అను బిజెపి ఎంపి సిఫారసును వాడుకోవడం విశేషం. ఓ పాలక పక్షం ఎంపిని వాడుకొని ఈ యువకులు అదే పాలక పక్షంపై తీవ్రమైన నిరసన రూపం ఎన్నుకోవడం అర్థం కాని రాజకీయ అంశం లేదా నిరసనకు తెగబడ్డ యువకులు కేవలం సోషల్ మీడియా ప్రభావంతోనే ఇంత పకడ్బందీ వ్యూహానికి వొడిగట్టారనడంలో కూడా పూర్తి నమ్మశక్యంగా లేదు.

ఇంత తెగింపు వ్యూహం వెనుక స్ఫూర్తి ఏవరు? ఏమిటి? నాడు భగత్ సింగ్ వ్యూహం వెనుక స్వాతంత్య్రం కోసం పోరాడిన అనుశీలన సమితి లాంటి సంస్థలు వీరికి ప్రేరణగా వున్నాయి. ఈ యువకుల వెనుక వున్నసంస్థలు ఏమిటి? ఆనాడు భగత్ సింగ్ అన్నట్లు చెవిటి వాడికి వినపడేలా, గుడ్డివాడికి కనపడేలా, వ్యక్తిగతమైన వ్యూహమా? విచారణలో మాత్రమే పార్లమెంటు దాడి వ్యూహంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఇకపోతే 21 ఏళ్ళ నాడు జరిగిన దాడి రోజే ఈ సంఘటన జరగడం, దాడి జరిగే సూచనలున్నాయని నిఘా వర్గాలు ప్రకటించడం, ఈ రెండు అంశాలు తెలిసి వున్న భద్రతా వలయం దాటుకొని యువకులు వెళ్ళడం మన భద్రత, నిఘా లోపాల్ని ఎత్తి చూపుతుంది. అన్నింటికీ మించి యువకులు పార్లమెంటులో వదలడానికి రంగు పొగను ఎంచుకోవడం ఒక్కటే మనం ఊపిరి పీల్చుకోగలిగిన అంశం. నిజంగా పాలక పక్షం చేసే నల్లచట్టాలు, మణిపూర్ మహిళల హింస గురించే ఈ స్థాయిలో యువకులు నిరసన తెలిపి వుంటే పాలకులు కళ్ళు తెరుచుకోవాల్సిందే. ఎందుకంటే ఎదురులేని మెజారిటీ పార్లమెంటులో వుందని తమకిష్టమైన చట్టాలు చేస్తే ప్రజలు హర్షించరనే సందేశం ఈ యువకుల సాహసోపేతమైన నిరసన అన్యాపదేశంగా తెలియజేస్తున్నది.

కాకపోతే భగత్ సింగ్ పార్లమెంటులో పొగ బాంబులు వేసిన రోజు పాలకులు తెల్లదొరలు, నేడు ఆ నలుగురు యువకులు రంగు పొగ వదిలిన పార్లమెంటు నల్ల దొరలది. ఏలుబడిలో తేడా లేదు పాలకుల్లోనే మన, పరభేదం ఉంది. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే చట్టాలు ప్రజలకు మేలు చేసేవి కావు అని ప్రజలు భావించినప్పుడు ఇలాంటి ప్రతిఘటన, నిరసన రూపం ప్రజలనుంచి ఎదురవుతాయి. యువకులు పార్లమెంటులో ప్రవేశం కోసం తోడ్పడ్డ పార్లమెంటు సభ్యుడు బిజెపికి చెందిన వ్యక్తి కాకపోయివుంటే ఇంక మనం కనీసం ఆలోచన లేకుండా ఆ యువకులకు దుండగుల ముద్రతోనే మన పాలక పక్షం, మీడియా చూస్తుండే కదా. ఏదిఏమైనా ప్రాణాలకు తెగించి ఈ నలుగురు యువకులు చేసిన సాహసం, భారత్ మాతాకీ జై అని వారిచ్చిన నినాదం వారి మీద ఉగ్రవాద ముసుగు తొలగించిందని చెప్పక తప్పదు. పార్లమెంటు మీద యువకుల దాడి అలియాస్ నిరసన అటు పాలకులకు హెచ్చరిక వంటిదే. ఇటు ప్రజలకు మేల్కొలుపు అని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News