న్యూఢిల్లీ : డిసెంబర్ 13 లోపు భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో విడుదల చేశాడు. తనను ఇటీవల కొందరు చంపాలని ప్రయత్నించారని వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నాడు. 2001డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. దీనిని ఉదహరిస్తూ పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించడం సంచలనం కలిగిస్తోంది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి డిసెంబర్ 13 తో 22 ఏళ్లు పూర్తవుతాయి. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్‌గురుని వీడియోలో చూపిస్తూ ఢిల్లీ బనేగా ఖలిస్థాన్ అనే శీర్షికతో పోస్టర్‌ను ప్రదర్శించాడు. అందులో ఢిల్లీ ఖలిస్థాన్‌గా మారుతుందని అన్నాడు.
తనను చంపడానికి భారత ఏజెన్సీలు పనిచేశాయని, వారి కుట్రలు విఫలమయ్యాయని , ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపాడు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 22 న ముగుస్తాయి. ఈ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. భద్రతాసంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. పార్లమెంట్ ప్రాంగణం మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశాం. సమావేశాలు జరుగుతున్నప్పుడు .. మేం అత్యంత అప్రమత్తంగా ఉంటాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అనుమతించం.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భద్రతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను పెంచినట్టు తెలిపారు. పన్నూన్ వెనుక పాకిస్థాన్‌కి చెందిన ఐఎస్‌ఐ సంస్థ ఉన్నట్టు భారత అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో పన్నూని హతమార్చడానికి కొందరు ప్రయత్నించారని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అతను భారత్‌లో నిషేధించిన యూఎస్ ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్ చీఫ్‌గా ఉన్నాడు. భారత్ మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టు లిస్టులో కూడా ఉన్నాడు.