కోల్‌కతా : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కాన్వాయ్‌పై బుధవారం బెంగాల్, బీహార్ సరిహద్దుల్లో పశ్చిమ బంగ్లా లోని మాల్గాలో రాళ్లదాడి జరిగింది. హరిశ్చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాగంజ్ సమీపంలో రాహుల్ ఆహన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో రాళ్లు విసరడంతో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను కొందరు టార్గెట్ చేశారని, ఈ దాడి వెనుక పశ్చిమబెంగాల్ అధికార పార్టీకి సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
“ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో పోలీస్‌లంతా బిజీగా ఉన్నారు. మా వద్ద అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. ” అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ సంఘటనను భద్రతా వైఫల్యంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో రాహుల్ ఆ కారులో లేరు. రాహుల్ యాత్రకు పదేపదే అడ్డంకులు ఎదురౌతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ పంపారు. ఈ క్రమం లోనే మాల్గా లోకి ప్రవేశించిన తర్వాతే ఆయన భయాలు నిజమయ్యాయి. బెంగాల్ బీహార్ సరిహద్దులో ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ భట్టాచార్య డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. మరోవైపు తృణమూల్ ప్రభుత్వం ఈ యాత్రకు సహకరించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ముర్షిదాబాద్ జిల్లా లోకి అడుగుపెట్టిన తరువాత రాహుల్ బస చేయాల్సిన స్టేడియానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఇది కుట్రలో భాగం గానే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు తృణమూల్ అధినేత్రి , ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించినప్పటి నుంచి ఇండియా కూటమి లోని టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పరిస్థితి గంభీరంగా మారింది.