నిందితుడు హదీ మతర్ వెల్లడి
న్యూయార్క్: ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ కోర్‌తో తనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యయత్నానికి పాల్పడిన 24 ఏళ్ల యువకుడు హదీ మతర్ ఖండించాడు. చిత్తశుద్ధి ఏమాత్రం లేని రష్దీని తాను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడానికి వెనుక ఎవరూ లేరని, తనకు తానుగా ఈ చర్యకు పాల్పడ్డానని ప్యూ జెర్సీకి చెందిన హదీ మతర్ స్పష్టం చేశాడు. రష్దీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్న వార్త విని ఆశ్చర్యపోయానని ప్రస్తుతం చౌటక్వా కౌంటీ జైలులో ఉన్న మతర్ న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వూలో వ్యాఖ్యానించాడు. ది శటానికి వర్సెస్ నవలను ప్రచురించిన తర్వాత రష్దీని హతమార్చాలంటూ 1989లో అప్పటి ఇరాన్ అధినాయకుడు అయాతొల్లా ఖొమేనీ జారీ చేసిన ఫత్వాను స్ఫూర్తిగా తీసుకునే రష్దీపై హత్యాయత్నానికి పాల్పడ్డారా అన్న ప్రశ్నకు మతర్ సమాధానమివ్వలేదు. తాను అయాతొల్లాను గౌరవిస్తానని, ఆయనో గొప్ప వ్యక్తని, ఇప్పటికి తాను ఇంతకుమించి మట్లాడబోనని మతర్ తెలిపాడు.