అర్థరాత్రి బాంద్రాలోని ఇంట్లో దుండగుడి దాడి తప్పిన ప్రాణాపాయం లీలావతి ఆస్పత్రిలో
చికిత్స, విజయవంతంగా ఆపరేషన్ సైఫ్ మెడ, వెన్నెముక, చేతికి కత్తిపోటు గాయాలు
ముంబై: సినీనటుడు సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని ఇంట్లో దుండగుడి దాడిలో గాయపడ్డారు. వెంట నే లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడి గదిలోకి వెళ్తుండగా చూసి అతడిని అడ్డుకున్నాడు. దాంతో అగంతకుడు సైఫ్ తో ఘర్షణ పడి కత్తిపోట్లకు పాల్పడ్డాడు. దీంతో సైఫ్ అలీఖాన్ షాక్ కు గురయ్యారు. దాడి వెంటనే ఆ దుండగుడు పరారయ్యాడు. దాదాపు ఆరు కత్తిపోట్లతో రక్తం కారుతుండగా సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వెంటనే వైద్యులు స్పందించి, శస్త్రచికిత్స కూడా చేశారు. ఘటన జరిగిన సమయంలో సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ ఖాన్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బాంద్రావెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలోని నాల్గో అంతస్తులో సైఫ్ కుటుంబం ఉంటోంది.
అగంతకుడు దొంగతనానికి పాల్పడేందుకే ఇంట్లో ప్రవేశించాడని, ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ ఎదురుపడడంతో దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఆ దొంగ మొదట పక్కబిల్డింగ్ లో ప్రవేశించి అక్కడి నుంచి గోడ ఎక్కి నటుడి ఇంట్లో ప్రవేశించాడని పోలీసులు అంటున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా ఏర్పాటు చేసిన ఫైర్ ఎస్కేప్ ద్వారా దొం గ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ప్రవేశించాడు. ఖాన్ ఇంట్లో పని చేస్తున్న ఎలియామా ఫిలిప్స్ అలియాస్ లిమా రాత్రి 2 గంటల సమయంలో మొదట అగంతకుడిని చూసి కేకలు వేసింది.
దీంతో ఖాన్ బయటకు వచ్చారు. ఖాన్ కన్పించగానే షాక్ తిన్న దొంగ దాడికి తెగబడ్డాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో దుండగుడు ఖాన్ పై కత్తితో దాడిచేసి గాయపరచాడు. ఈ క్రమంలో ఆరు కత్తిపోట్లు తగిలాయి. దుండగుడు ఎలా ఇంట్లోకి ప్రవేశించినదీ, పారిపోయినదీ సీసీటివి కెమెరాలో నమోదయ్యాయి. పని మనిషితో సహా అందరినీ పోలీసులు ప్రశ్నించారు. భవనానికి ఉన్న సెక్యూరిటీ కన్ను కప్పి దుండగుడు ఎలా ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడన్నది ప్రశ్న.
సైఫ్ అలీఖాన్‌ను దాదాపు రెండున్నర గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కొడుకే ఖాన్ ను అస్పత్రికి తీసుకువచ్చాడు. పదునైన కత్తితో పొడవడంతో ఖాన్ కు గాయాలయ్యాయి. ముఖ్యంగా మెడ, వెన్నెముక వద్ద బలమైన గాయాలయ్యాయి. వెంటనే శస్త్ర చికిత్స చైశారు. ఎడం చేతిమీద, మెడమీద కూడా లోతుగా కత్తిపోట్లు దిగాయని మెడమీద ప్లాస్టిక్ సర్జరీ చేశారని లీలావతి ఆస్పత్రి కి చెందిన నితిన్ డాంగే తెలిపారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఖాన్ కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ఖాన్ వెన్నెముక ప్రాంతం నుంచి రెండున్నర అంగుళాల కత్తి ముక్కను తొలగించినట్లు తెలిపారు.
దుండగుడి ఫోటో విడుదల
ముంబై పోలీసులు ఖాన్ ఇంట్లో దాడికి పాల్పడిన దొంగ ను గుర్తించారు. ఫోటో విడుదల చేశారు. అతడి వేలి ముద్రలను సేకరించారు. వెంటనే దుండగుడి కోసం కందివాలి, వడాలా, ప్రభాదేవి ప్రాంతాలలో పోలీసులు గాలింపు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత మరి కొన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.
సైఫ్‌పై దాడి దురదృష్టకరం,
ముంభై సురక్షితమే.. దేవేంద్ర ఫడ్నవీస్
నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి దురదృష్టకరమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అయితే ముంబై సురక్షితంగా లేదని మాటను ఖండించారు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎం పేర్కొన్నారు. ఖాన్ పై జరిగిన దాడి రాజకీయ వివాదంగా మారింది
శాంతి భద్రతలు ఎక్కడ: శరద్ పవార్
నటుడు ఖాన్‌పై జరిగిన దాడిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఖండించారు. ముంబైలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దంపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయని, హోంశాఖ కూడా నిర్వహిస్తున్న సీఎం ఫడ్నవీస్ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని దుమ్మెత్తి పోశారు.