తెలంగాణను అవమానిస్తున్న పిసిసి అధ్యక్షుడు
తెలంగాణను తెచ్చిన కెసిఆర్‌కు అండగా నిలబడదాం
మేమెవరికీ బి టీమ్ కాదు.. రాష్ట్ర ప్రజలకే ఎ టీమ్
కెసిఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయి
కాంగ్రెస్‌కు ఐదుగురు సిఎం అభ్యర్థులు దొరికారు.. కానీ ఓటర్లే లేరు: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు మండిపడ్డారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని.. ఆయన తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. డబ్బులు పంచుతూ దొరికిన రేవంత్ రెడ్డి డబ్బులపైన శపథం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కలికాలంలో విచిత్రాలు జరగుతాయని వింటాం కానీ రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే అది నిజమే అన్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మంత్రి కెటిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టిఎన్‌జిఒ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ ఎంఎల్‌సిలు కర్నె ప్రభాకర్,శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఆయన తొందరపడి 2009లో బిఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోయారని.. ఇప్పుడు మళ్లీ రావడంతో తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తమ పార్టీలోనే కొనసాగితే పైళ్ల శేఖర్‌రెడ్డి ఉండేవారు కాదని కెటిఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తమకు తోడుగా ఉన్నారని..తమ నేత కెసిఆర్ ఏ ఆదేశం ఇచ్చినా తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ నేతలు అందరూ బిఆర్‌ఎస్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సిఎం కెసిఆర్‌కు ఉద్యమకారులు అండగా ఉండాలని పిలుపిచ్చారు. హీన కాల్చి నక్కల పాలు చేయొద్దని జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారని, కొన్ని గద్దలు తెలంగాణపై దాడి చేయడానికి కాచుకు కూర్చున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే తాము బిర్లామందిర్ వద్ద, నాంపల్లి దర్గా వద్ద అడుక్కునే వాళ్లమని అవమానపరుస్తున్నారని, తెలంగాణ అస్థిత్వం మీద దాడి జరుగుతుంటే చూస్తూ ఉందామా..?…తెగించి తెలంగాణను తెచ్చిన కెసిఆర్‌కు అండగా ఉందామా…? ఆలోచించాలని మంత్రి కెటిఆర్ అన్నీ పార్టీల తెలంగాణ నాయకులను కోరారు. కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ పెట్టకుంటే.. తెలంగాణ ఏర్పాటును అనివార్యతను కల్పించకపోతే…టి పిసిసి, టి బిజెపి పోస్టులు ఉండేవా..?అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉండేనా…? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది బిఆర్‌ఎస్ పార్టీనే అని తెలిపారు. సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి దూషించింది రేవంత్‌రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు.
మేము తెలంగాణ ప్రజల టీం
మోడీ వచ్చి బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు బీ టీమ్ అని అంటారు…రాహుల్ గాంధీ వచ్చి తాము బిజెపి బీ టీమ్ అని అంటారని, కానీ తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. తెలంగాణ ప్రజలకు ఎ టీమ్ అని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీలు ఒకరికొకరు కౌగిలించుకుంటారు, సహకరించుకుంటారని, వారిద్దరు కలిసి మమ్మల్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బిసి జనగణన చేస్తామని రాహుల్ చెబుతున్నారు. కానీ తాము గతంలోనే కుల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కెటిఆర్ గుర్తు చేశా రు. కొత్తగా ఇప్పుడు రాహుల్ గాంధీ కుల గణన చేస్తామని చెబుతున్నారు… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిసి జనగణనను రాహుల్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ తొమ్మిదేళ్లలో ఏం తక్కువైందో చెప్పాలని ప్ర శ్నించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఇందిరమ్మ రా జ్యం తెస్తామంటున్నారని, అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటని అడిగారు. మళ్లీ రూ.20 పింఛను ఇస్తారా..?…మళ్లీ ఎమర్జెన్సీ రోజులు తెస్తారా..? అని ప్రశ్నించారు.
కెసిఆర్‌ను ఎందుకు దించేయాలి..?
తెలంగాణలో కెసిఆర్‌ను దించేయాలని అంటున్నారని, రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకా, రైతు బందును ఇచ్చినందుకా.. మిషన్ భగీరథ ద్వారా నీరు ఇచ్చినందుకా.. యాదాద్రిని నిర్మించినందుకా..అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, 60 ఏళ్లు అధికారంలో ఉండి చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఛాన్స్ అనడం హాస్యాస్పదమని విమర్శించారు. నల్గొండ, మునుగోడు ప్రాంతాలను జీవఛ్చాలకు కారణం కాంగ్రెస్ కాదా..? అని నిలదీశారు. తెలంగాణలో ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాను అన్న వాళ్లు ఇప్పుడు సర్కార్ దవఖానాకు పోతాం అంటలేరా అని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకోలేదా…ఫ్లోరైడ్ బాధ తీరలేదా..అని అడిగారు. ముదిరాజ్ , చేనేత, కల్లు గీత కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను ఆదుకుంది కెసిఆర్ కాదా..? అని ప్రశ్నించారు.
బిసి బంధు ద్వారా కుల వృత్తులను ఆదుకుంటుంది కెసిఆర్ కాదా..తాండాలను పంచాయితీ చేసింది కెసిఆర్ కాదా…దళితబందు ద్వారా దళితుల అభ్యున్నతి చేపట్టింది కెసిఆర్ కాదా…ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుంది కెసిఆర్ కాదా…తొమ్మిదేళ్లలో తెలంగాణలో కర్ఫ్యూ లేకుండా ప్రశాంతంగా ఉంది వాస్తవం కాదా…అని అడిగారు. కెసిఆర్ వల్ల ఎవరికి అన్యాయం జరిగింది చెప్పాలని అన్నారు. గతంలో ఉన్న ఒక్క ఎంఎల్‌ఎ పార్టీ విడిచి వెళ్లారని, వివిధ సమీకరణ నేపథ్యంలో అక్కడ ముదిరాజ్‌కు సీటు కేటాయించడలేదని చెప్పారు. ముదిరాజ్ బిడ్డను రాజ్యసభ సభ్యుడిని చేసింది కెసిఆర్ కాదా… భవిష్యత్తులో ముదిరాజ్‌లకు న్యాయం చేసేది కెసిఆర్ అని స్పష్టం చేశారు. కెసిఆర్‌ను నోటికొచ్చినట్లు తిట్టి తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని దేవుడు అంటున్నారని, మోడీ ఎవరికి దేవుడు అని కెటిఆర్ ప్రశ్నించారు. మోడీ దేవుడు అయితే ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలని సూచించారు. తెలంగాణ మీద నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలను ప్రేమ ఉండదని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు. దసరా వస్తుంది…ఊళ్లలో చర్చ పెట్టండి… తెలంగాణకు ఏదీ మంచి.. ఏదీ చెడో ఓ సారి ఆలోచన చేయాలని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆరే…తెలంగాణ అభివృద్ధి చేసేది కెసిఆరే అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు సిఎం అభ్యర్థులే ఉన్నారు..
కాంగ్రెస్ నేత జానారెడ్డి తాను కూడా సిఎంను అవుతానని అంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు సిఎం అభ్యర్థులు దొరికారు కానీ.. ఓటర్లే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎవరి వల్ల మేలు జరిగిందో ప్రజలు చర్చించాలని కోరారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలోనో పెట్టొద్దని కెటిఆర్ అన్నారు. ఒకే వేదిక మీద ఉద్యమకారులు, జర్నలిస్టు సంఘం నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు… ఇలా అన్నివిభాగాల వారు ఉండం సంతోషంగా ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
మళ్లీ అధికారంలోకి తీసుకొద్దాం : జిట్టా
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తుంటే తనకు ఒళ్లు పులకరించిందని జిట్టా బాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ తనను మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. రామన్న, హరీశ్ అన్న నాయకత్వంలో అడుగులో అడుగేసి నడుస్తానని స్పష్టం చేశారు. గౌరవం ఉన్నచోటుకే ఉద్యమకారులంతా రావాలని, బిఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.