Saturday, December 21, 2024

బెంగాల్‌లో కేంద్ర మంత్రి నిశిత్ కారుపై దాడి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కూచ్‌బెహార్‌లో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న ఎస్‌యువి వాహనం కారు అద్దాలు పగిలాయి. రాష్ట్రంలో అధికార జులుం సాగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే గూండాలై ఈ దాడికి దిగారని కేంద్ర మంత్రి ఆ తరువాత ఆరోపించారు. ఈ ప్రాంతానికి కాన్వాయ్ రాగానే అక్కడున్న జనం దాడికి పాల్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి వెంటనే అదుపులోకి రాలేకపోయింది. ఈ లోగానే ఈ కూచ్‌బెహార్‌కు ఎంపిగా ఉన్న కేంద్ర మంత్రి కారు కూడా రాళ్ల దాడికి గురైంది. కేంద్ర మంత్రి పర్యటనకు వస్తేనే ఈ విధంగా భయానక స్థితిని కల్పిస్తే ఇక రాష్ట్రంలో సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిత్వశాఖలో ఉన్న ప్రామాణిక్ ప్రశ్నించారు.

బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఏ విధంగా కుంటుతున్నదనేది ఈ ఘటనతో తెలుస్తోందన్నారు. బిజెపి స్థానిక కార్యాలయానికి మంత్రి పెద్ద ఎత్తున కాన్వాయ్‌తో వెళ్లుతుండగా మార్గమధ్యంలో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఓ గిరిజనుడి మరణంపై స్థానికంగా ఆగ్రహం చెలరేగుతోందని అక్కడి వార్తా పత్రికలు తెలిపాయి. గిరిజనుడు బిఎస్‌ఎఫ్ కాల్పుల్లో మృతి చెందినట్లు స్థానిక గిరిజన సంఘాలు ఇతర సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఇక్కడికి రావడం ఉద్రిక్తతకు దాడికి దారితీసి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ప్రాంతానికి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారని ఇటీవలే ఇక్కడ జరిగిన ర్యాలీలో టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రశ్నించడం, గిరిజనుల బాధలను మాన్పడానికి కేంద్రం ఏం చేస్తోందని నిలదీయడం వంటి పరిణామాలు నేరుగా ప్రామాణిక్‌పై జనం ఆవేశానికి పురిగొల్పినట్లు వెల్లడైంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా తాము అడ్డుకుంటామని టిఎంసి వర్గాలు మంత్రికి తెలిపాయి. ఈ ప్రాంతంలో ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నుంచి నల్లజెండాలే కన్పిస్తాయని టిఎంసి స్థానిక నేత ఉదయన్ గుహా రెండు మూడు రోజుల క్రితమే తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రికి ఇప్పుడు ఈ అనుభవం ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News