కాబూల్: బుధవారం అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో తాలిబన్ల వాహనాలపై జరిగిన దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు తాలిబన్లు, ముగ్గురు పౌరులున్నారు. ఓ గ్యాస్ స్టేషన్ వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తాలిబన్లు, అక్కడి ఓ ఉద్యోగి, ఓ చిన్నారి మరణించారు. మరో వాహనంపై జరిగిన బాంబు దాడిలో ఇద్దరు తాలిబన్లు తీవ్రంగా గాయపడగా, ఓ చిన్నారి చనిపోయారు. ఇంకో వాహనంపైనా బాంబు దాడి జరిగింది. మూడో ఘటనలో గాయపడింది తాలిబన్ సభ్యుడా..? కాదా..? అన్నది స్పష్టంగా తెలియదు. తూర్పు అఫ్థానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)ఉగ్రవాదులే తాలిబన్లపై దాడులకు పాల్పడుతున్నారు. జలాలాబాద్‌లో గత వారం ఐఎస్ జరిపిన దాడిలో 8 మంది చనిపోయారు. తామే ఆ దాడి జరిపామని ఐఎస్ ప్రకటించింది. దాంతో, అఫ్ఘన్‌లో తాలిబన్లకూ, ఐఎస్‌కూ మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు.