గువాహతి : అసోం-మిజోరం సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సిఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ అగర్వాల్, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ సరిహద్దు పట్టణానికి సమీపంలో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల తరువాత సోమవారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు వైరంగ్టే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామన్నారు. కచార్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, కచార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీడియో చౌదరిపై కూడా అదే అభియోగాల కింద కేసులు నమోదు చేశాము అని తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సదరు అధికారి పేర్కొన్నారు.