Wednesday, January 22, 2025

నిర్మాణరంగ వర్శిటీ

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ ఆలోచనల ప్రకారం
అంతర్జాతీయ స్థాయి

న్యాక్ ప్రాంగణంలో 12 ఎకరాల్లో ఏర్పాటుకు పరిశీలన
అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సుదీర్ఘ చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనల ప్రకారం న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) అధ్వర్యంలో నిర్మించే కన్‌స్ట్రక్షన్ యూనివర్సిటీ (నిర్మాణ రంగ యూనివర్సిటీ) అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో మంత్రి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగం రోజు రోజుకు పుంజుకుంటోందన్నారు. ప్రపంచ దేశాలు సైతం అధునాతన టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేస్తున్నాయన్నారు. దేశ నిర్మాణ రంగ వ్యవస్థ కూడా అంతటి అధునాతన టెక్నాలజీ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో ఆలోచించి ప్రపంచంతో పోటీ పడే విధంగా అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలని, నిర్మాణ రంగం కోసం నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయాలని కన్‌స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ

ప్రస్తుతం నిర్మాణం రంగంలోకి వస్తున్న వారికి పాత పద్ధతిలోనే బోధన జరుగుతుందన్నారు. కానీ ఈ యూనివర్సిటీ ద్వారా ప్రపంచంతో పోటీ పడే విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో టెక్నాలజీ విద్య అందనుందన్నారు. ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ విద్యా బోధన ఉంటుందన్నారు. కొత్త రీసెర్చ్ కోర్సులు కూడా ఇందులో ప్రవేశపెట్టొచ్చన్నారు. దీని ద్వారా నిర్మాణ రంగ ఇంజనీర్లు, నిపుణులు, సైంటిస్టులు ఎంతో మంది తయారవుతారన్నారు. తెలంగాణతో పాటు దేశ నిర్మాణ రంగ వ్యవస్థలోనే వారు కీలకం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం సకల సౌర్యాలతో, నూతన టెక్నాలజీకి తగ్గ ప్రమాణాలతో హైదరాబాద్‌లోని న్యాక్ క్యాంపస్ ప్రాంగణంలోని 46 ఎకరాల్లోని 12 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుపై పరిశీలిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగ యూనివర్సిటీ ఏర్పాటు స్థల మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. నిర్మాణ రంగ యూనివర్సిటీ కోసం కట్టాల్సిన బిల్డింగ్‌లు, ఇతర సౌకర్యాల కోసం కావాల్సిన ఫ్యాకల్టీలకు అయ్యే ఖర్చును అంచనా వేయాలని మంత్రి అధికారులను అదేశించారు. సమగ్రమైన సమాచారంతో మరోసారి భేటీ కావాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News