Friday, November 22, 2024

ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం… భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

యశోద ఆసుపత్రిలో సర్జరీ…ఐసియుకు తరలింపు
కత్తిపోట్లకు గురైన ప్రభాకర్‌రెడ్డికి 15 సెంటీ మీటర్ల
కడుపును కట్ చేసి 10 సెంటీ మీటర్ల చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు
ఆసుపత్రిలో ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తి పోటుకు గురైన ప్రభాకర్‌రెడ్డిని ముందుగా గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి.. అంబులెన్సులో ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొత్త ప్రభాకర్‌రెడ్డికి యశోద ఆసుపత్రి వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీ నిర్వహించారు. ఆయనకు చిన్న పేగుకు నాలుగో చోట్ల గాయాలయ్యాయని, 15 సెంటీ మీటర్లపై కడుపును కట్ 10 సెంటీ మీటర్ల చిన్న ప్రేగును తొలగించి శస్త్రచికిత్స నిర్వహించినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రక్తం అంతా కడుపులో పేరుకుపోయిందని, అందుకే 15 సెంటీ మీటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశామని వివరించారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయిందని చెప్పారు. గాయపడిన ప్రభాకర్‌రెడ్డిని వెంటనే గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోద వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఐసియులో ఉంచి.. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డికి గాయం తీవ్రంగా ఉందని శస్త్రచికిత్స సమయంలో గుర్తించిన వైద్యులు, ఇన్ఫెక్షన్ సోకకుండా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సిఎం కెసిఆర్ పరామర్శ
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. సోమవారం రాత్రి సిఎం కెసిఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లి ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్‌రావు
ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి కోలుకోవాలంటూ మంత్రి హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు ఈ సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఆయన నారాయణఖేడ్‌కు వెళ్లకుండానే వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయలుదేరారు. ఎంపి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కత్తి గాటు ఎంత వరకు ఉందో పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు హుటాహుటిన యశోద ఆసుపత్రి చేరుకొని కారు దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి వైద్యులతో మాట్లాడారు. కార్యకర్తలెవరూ సంయమనం కోల్పోకూడదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హరీశ్ రావు సూచించారు. రాజకీయాల్లో హత్యా రాజకీయాలు పనికి రావు అని, ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News