హుస్నాబాద్: స్నేహితుడికి బదలుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు బీరు సీసాలతో కొట్టి హత్యాయత్నం చేసిన సంఘటన హుస్నాబాద్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితులు దాడి చేస్తూ చిత్రించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ ఠాణాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి సందెపోగు మహేందర్ నిందితులను అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన వరయోగుల అరవింద్‌స్వామి, మహమ్మద్ మైనొద్దీన్ స్నేహితులు. అరవింద్‌స్వామి వద్ద ఇరవై రోజుల క్రితం మైనొద్దీన్ రూ. 2,500 చేయిబదలుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని పది రోజుల క్రితం ఆర్టీసీ డిపో వద్ద మైనొద్దీన్‌ను అరవింద్‌స్వామి అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. అటుగా వెళ్తున్న మైనొద్దీన్ సోదరుడు గమనించి తన తమ్ముడి చెంపపై కొట్టి అక్కడి నుంచి పంపించాడు.
దీనిని అమమానంగా భావించిన మైనొద్దీన్ అరవింద్‌స్వామిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని అతని స్నేహితుడు పిట్టల అరుణ్‌కుమార్, అతనికి మామ వరుస అయ్యే గంగరబోయిన(కుక్కల) మల్లేశం, మరో బాలనేరస్తుడితో ప్లాన్ వేశారు. ఈ నెల 11వ తేది రాత్రి అరుణ్‌కుమార్‌తో ఫోన్ చేయించి డబ్బులు ఇస్తామని, నాగారం రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్ వద్దకు అరవింద్‌స్వామి, అతని స్నేహితుడు శనిగరపు అఖిలేష్ రావాలని పిలిచారు. వారు అక్కడికి చేరుకోగానే మైనోద్దీన్, అరుణ్‌కుమార్, మల్లేశం అప్పటికే తెచ్చుకున్న బీరుసాసాలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. మరో బాలనేరస్తుడు ఈ ఘటనను ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ వీడియోను మైనొద్దీన్ వాట్సాప్ నంబర్‌కు స్టేటస్‌గా పెట్టడంతో వైరల్‌గా మారింది. బాధితుడు వరయోగుల అరవింద్‌స్వామి, అతని స్నేహితుడు శనగరపు అఖిలేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేసిన పోలీసులు శనివారం ఉదయం మైనొద్దీన్ ఇంటి వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఎసిపి వివరించారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందుతులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఆయన వెల్లడించారు. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తల్లిదండ్రులు వారి పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై సజ్జనపు శ్రీధర్, ప్రొబేషనరీ ఎస్సై శ్వేత, సిబ్బంది ఉన్నారు.
Attempted murder for not giving money taken in lieu