కీవ్: రష్యా దళాలను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని రక్షించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రష్యా దళాలు తమ నష్టాలను త్వరగా పూడ్చుకొని ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తాయని ఆ దేశాలు అంచనా వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రవాసంలో ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రష్యాతో పోరాడడానికి అమెరికానుంచి ఉక్రెయిన్ దళాలకు నిరంతరం ఆయుధాలు అందాల్సిన అవసరం ఉంది.అప్పుడే వాటి ప్రతిఘటన బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మానవీయ, ఆయుధ సహాయాన్ని అందించేందుకు 10 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్యాకేజి కేటాయించాలని అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ అమెరికా కాంగ్రెస్‌ను కోరింది. ఉక్రెయిన్‌లో పోరు కొనసాగాలంటే అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.
బలగాల్లో, ప్రజల్లో ఆయన నైతిక స్థైర్యం నింపాలి. అయితే కీవ్‌ను రష్యాస్వాధీనం చేసుకునే అవకాశం ఉండడంతో రాజధాని, లేదా దేశం వెలుపలనుంచి ఆయన పాలన కొనసాగించే విధంగా అమెరికా విదేశాంగ శాఖ, పెంటగాన్, ఇతర ఏజన్సీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీనిపై పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అమెరికాకీలక అధికారి స్పందించారు. ‘ ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్పందించేలా ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం, అవసరమైతే జెలెన్‌స్కీ పోలండ్‌నుంచి పాలన నిర్వహించేలా ప్రవాస ప్రభుత్వానికి సన్నాహాలు జరుగుతున్నాయి’ అని ఆ అధికారి చెప్పారు. మరోవైపు జెలెన్‌స్కీని, ఆయన మంత్రివర్గాన్ని అవసరమైతే శరవేగంగా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేసుకొంటున్నారు.