హైదరాబాద్ : ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానాన్ని సమీక్షించి విద్య పట్ల మన దృక్పథం మారాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ అన్నారు. ఒయు బి.ఇడి కళాశాలలో మంగళ,బుధవారాలలో నిర్వహిస్తున్న జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాతృ భాష విద్య పట్ల మనం మరింత శ్రద్ధ వహించాలన్నారు. ‘ఎమర్జింగ్ పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యూకేషన్’ జాతీయ సెమినార్‌కు దేశం నలుమూలల నుంచి 200 వరకు పరిశోధనా పత్రాలు వచ్చాయని సెమినార్ కన్వీనర్ డాక్టర్ పారిపెల్లి శంకర్ తెలిపారు.
ఒక నూతన విద్యా సిద్ధాంతాన్ని ఈ సెమినార్ ఆలోచనల నుంచి రూపొందించడానికి న్యూపా, కేంద్రీయ విశ్వవిద్యాలయం కేరళ, హైదరాబాద్ డిఆర్‌డిఒ, యం.జి.యన్.సీఆర్.ఐ వంటి జాతీయ సంస్థల నిపుణులు ప్రొఫెసర్ ప్రణీతపాండా, డాక్టర్ తియాగో, డాక్టర్ వీర బ్రహ్మం, డబ్ల్యూజి. ప్రసన్నకుమార్, ప్రొఫెసర్ కొరడా సుబ్రమణ్యం వివిధ అంశాలపై మాట్లాడారు.
ఈ సెమినార్‌లో పాల్గొన్న ఐసిఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ సైన్స్‌లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన పరిశోధనలు చేయడానికి ఆర్థిక చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందింపుచ్చుకోవాలని అన్నారు. ఈ సెమినార్‌లో బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్, కె. మూర్తి, శాఖాధిపతి ఎ. రామకృష్ణ,టి. మృణాళిని, అధ్యాపకులు డాక్టర్ డి. సునీత, డాక్టర్ జె. లలిత, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ మధుకర్‌లు పాల్గొన్నారు. సెమినార్ కో -కన్వీనర్ డాక్టర్ జి. దుర్గేశం వందన సమర్పణ చేశారు.