గరిష్టంగా రూ.66 వేలు, కనిష్టంగా రూ.49 వేలు పలికిన గజం రేటు ధర
60 ప్లాట్ల విక్రయం ద్వారా హెచ్‌ఎండిఏకు రూ.105.16 కోట్ల ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్: మోకిల గ్రామంలోని హెచ్‌ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాలుగవ రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30 ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. అప్‌సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల అమ్మకాల ద్వారా నాలుగవ రోజు హెచ్‌ఎండిఏకు రూ.105.16 కోట్లు ఆదాయం వచ్చింది. నాలుగవ రోజు సరాసరి గజం రేటు రూ.56,537లు, పలుకగా గరిష్టంగా రూ.66 వేలు, కనిష్టంగా రూ.49 వేలు పలికింది. మోకిలలో మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ రాగా, రెండో రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడోరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది.
మోకిల హెచ్‌ఎండిఏ లే ఔట్, కోకాపేట్ నియోపాలిస్ లే ఔట్‌కు దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం భారీగా పోటీ పడుతున్నారు. ఇక నేటితో ఈ ప్లాట్ల వేలం ముగియనుండటంతో ఔత్సాహికులు వేలంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన 60 ప్లాట్లకు నేడు హెచ్‌ఎండిఏ వేలం నిర్వహించనుండగా భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ అధికారులు పేర్కొంటున్నారు. తొలి మూడు రోజుల్లో లే ఔట్ లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70వేల నుంచి రూ.1,05, 000ల ధర పలికింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్-2 లో 300 ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు.