పోలీస్ స్టేషన్‌కు తరలించిన నగర పోలీసులు
వందలాది వాహనాల తరలింపు
యజమానులు రాకుంటే వేలం వేస్తాం
స్పష్టం చేస్తున్న పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్లపై వాహనాలను రోజుల తరబడి వదిలేసిన వారికి హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి వాహనాలను ఇలా వదిలేస్తే కుదురదని తేల్చిచెబుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వదిలేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఆయా స్టేషన్లకు మంగళవారం తరలించారు. రోడ్లపై వదిలేసిన వాహనాలపై నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై వాహనాలను ఇష్టారీతిగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానస్పదంగా, నిర్లక్షంగా వదిలేసిన వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా తరలించారు. వాహనాల యజమానులు నిర్ణీత సమయంలో లోపు స్పందించాలని లేకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39 బి కింద వేలం నిర్వహిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.