కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిపోయిన చిన్న విస్తీర్ణంగల ప్లాట్లు (స్ట్రె పీసెస్) వేలాన్ని ఈ నెల 24వ తేదీన ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి పి గౌతం ఓ ప్రకటనలో తెలియజేశారు. హౌసింగ్ బోర్డు గృహా నిర్మాణ పథకాలను అమలు చేయడానికి వీలుకాని అక్కడక్కడ గృహాల మధ్య ఉన్న ప్లాట్లు మాత్రమే వేలానికి ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. వేలానికి నిర్దేశించిన ప్లాట్లు అత్యంత విలువవైన అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించినవని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బోర్డు ద్వారా చేపట్టే ఎల్‌ఐజి, ఎంఐజి గృహ నిర్మాణాలకు వినియోగించబడుతుందని ఆయన తెలిపారు. అంతే కాకుండా నగరం చుట్టు ప్రక్కలగల అత్యంత విలువైన సుమారు ఏడు వందల ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాలు ఉన్నాయని ఇవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టి నట్లు ఆయన తెలియజేశారు. విలువైన బోర్డు భూముల రక్షణకు ప్రహారీ నిర్మాణాలు ఇప్పటికే చేపట్టామని ఇందుకు ప్రభుత్వం రూ.25 కోట్లను హౌసింగ్ బోర్డుకు మంజూరు చేసిందని అయన వెల్లడించారు. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములను చట్ట విరుద్ధంగా ఆక్రమించే వారిని ఇకపై ఉపేక్షించమని, వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో హెచ్చరించారు.