Monday, January 20, 2025

గ్రాంట్ థోర్న్‌టన్‌తో అదానీ కంపెనీల ఆడిట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/ న్యూయార్క్ : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీల షేర్లలో భారీ పతనం సంభవించగా, ఇప్పుడు కంపెనీ నష్ట నివారణ చర్యలు వేగవంతం చేసింది. అదానీ గ్రూప్ తన కంపెనీ షేర్ల నష్టాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. వ్యాపారాన్ని స్వతంత్ర ఏజెన్సీ ద్వారా విచారించాలని కంపెనీ నిర్ణయించింది. స్వతంత్ర ఏజెన్సీ గ్రాంట్ థోర్న్‌టన్‌ను అదానీ గ్రూప్ కొన్ని కంపెనీలను ఆడిట్ చేయమని కోరింది. ఈ వార్తలు వచ్చిన తర్వాత కూడా అదానీ గ్రూప్ షేర్లలో పతనం ఆగలేదు.

ఎకనామిక్ టైమ్స్ పోర్టల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ తమ కొన్ని కంపెనీలను ఆడిట్ చేయమని గ్రాంట్ థార్న్‌టన్‌ను కోరింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు గ్రూప్ ప్రయత్నిస్తోంది. జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ పెద్ద అడుగు వేసింది. విదేశాల నుంచి వచ్చిన డబ్బు, షేర్ల ధరలను తారుమారు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల వాల్యుయేషన్‌ను అధికం చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

ధనవంతుల జాబితాలో 24వ స్థానానికి అదానీ

గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. ఫోర్బ్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఫిబ్రవరి 14న అదానీ నికర విలువ రూ.4.31 లక్షల కోట్లకు (52.2 బిలియన్ డాలర్లు) పడిపోయింది. సోమవారం నాటికి అదానీ రూ. 4.49 లక్షల కోట్లు (54.4 బిలియన్ డాలర్లు) నికర విలువతో 23వ స్థానంలో ఉన్నాడు. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక రావడానికి ముందు అదానీ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

సెబీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కమిటీ

గ్రూప్-హిండెన్ బర్గ్ కేసులో నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. స్టాక్‌మార్కెట్ నియంత్రణ యంత్రాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందో? లేదో? కమిటీ చూస్తుంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవరులో కమిటీ సభ్యుల పేర్లను కోర్టుకు ఇవ్వనున్నారు. ఈ కేసు తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News