హైదరాబాద్: కాళేశ్వరం ప్రోజెక్టుకు సంబంధించిన ఆడిట్ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కాళేశ్వరం ప్రోజెక్టులో చోటు చేసుకున్న పలు అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలను తెలంగాణ రాష్ట్రానికి పంపింది. దీనికి ధీటుగా సమాధానం చెప్పటం కోసం సంబంధిత అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. కాగ్ అధికారుల దృష్టిలో అనేక అరోపణలు ఉన్నప్పటికీ.. నిధుల దుర్వినియోగం ఆరోపణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
డిజైన్లు మార్చడానికి గల కారణాలు, అందుకు అయిన అదనపు వ్యయం, కాంట్రాక్టర్ పాత్ర గురించి, వారికి అదనంగా ఎంత వరకు లాభించింది తదితర సందేహాలకు స్పష్టత ఇవ్వనున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు అంతగా పెరగటానికి గల కారణాలు కూడా వివరించనున్నారు. ఆడిట్ వ్యక్తం చేసిన సందేహాల్లో ప్రాజెక్ట్ వ్యయం రూ. 40,000 కోట్ల నుండి లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నది కూడా స్పష్టత రానుంది. నిధులు దారిమళ్ళినట్టు వచ్చిన ఆరోపణల్లో జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం రూ. గత నాలుగేళ్లలో 3982 కోట్లు ఇచ్చింది. పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ, సీఏడబ్ల్యూఎం పథకాల కింద కేంద్రం రూ. 1195 కోట్లు ఇచ్చింది. ఇతర కేంద్ర నిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,15,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎందుకు ప్రభుత్వం దారి మళ్లించారన్న ఆడిట్ ప్రశ్నలకు తగిన వివరణ ఇవ్వాల్సివుంది.
ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించటం గురించి కూడా సందేహాలు వ్యక్తపరిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 120 మిషన్లకు బదులు 105 మిషన్లు అమర్చి 20 పంప్ హౌస్ లకు బదులు 17 పంప్ హౌస్ లు నిర్మించారని, . కన్నెపల్లి పంప్ హౌస్ లోకి వరద నీరు వచ్చి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయినట్లు వచ్చిన ఆరోపణలకు కూడా ధీటుగా వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణాలు రూ. 97, 447కోట్లుగా తేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంది . ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెద్దమొత్తాల్లోనే రుణాలు సమకూర్చాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, మోటార్లు, పంపులు, ఇతర హైడ్రో ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులపై కూడా ఫోకస్ పెట్టారు. భూ నిర్వాసితులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉందనే వివరాలు కావాలని కాగ్ బృందం కోరినట్టు సమాచారం. మూడో ్ టీఎంసీ అంచనా వ్యయం, పనుల పురోగతి, మూడో టీఎంసీతో కలిగే ప్రయోజనాలు కూడా వివరించనున్నారు. సిబిఐకి బక్క జడ్సన్, కాగ్ కు షర్మిల ఫిర్యాదులు చేశారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోసం అడిగినట్లు తెలుస్తోంది.
ధీటుగా బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్దం:
కాగ్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలు, ఇతరుల నుంచి వస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా బదులిచ్చేందుకు సిద్దమవుతోంది.అంతే కాకుండా గోదావరి నదీజలాల ఆధారంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిగే బహుళ ప్రయోజనాలను కూడా వివరించేందుకు దీన్ని మంచి అవకాశంగా మలుచుకుంటోంది. గత ఏడాది భారీ వర్షాలు వరదల కారణంగా కాళేశ్వరం పంపుహౌస్‌కు జరిగిన నష్టాలపై నివేదిక సిద్దం చేస్తోంది. గత ఏడాది వర్షాకాలంలో గోదావరి వరద ఏకంగా 108.02 మీటర్ల మేర ప్రవహించింది.
దీని పరిమాణం 29 లక్షల క్యూసెకులకు పైగానే ఉంది. అంటే 1986 మట్టం కన్నా 1.2 మీటర్లు అధికంగా ఉంది. అసాధారణ రీతిలో వచ్చిన వరద వల్లనే పంప్‌హౌజ్ రెగ్యులేటర్ గేట్ల రబ్బర్ సీల్స్ ఊడిపోయాయి. ఫోర్‌బేలోకి అధికమొత్తంలో నీళ్లు వచ్చాయి. అతి భారీ వర్షాలకు పంప్‌హౌజ్ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్తు సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. దీంతో అధికారులు నీరు తోడలేక పోయారు. ఫలితంగా ఫోర్‌బే రక్షణ గోడపై వత్తిడి పెరిగి కొంత కూలిపోయింది. పంప్‌హౌజ్ నీళ్లతో నిండింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. చందనపూర్ వాగు పొంగడం వల్ల బరాజ్ రక్షణకు నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొర్లినందువల్ల అన్నారం పంప్‌హౌజ్ మునిగిందని అని అధికారులు వివరిస్తున్నారు.