Friday, November 22, 2024

వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్

- Advertisement -
- Advertisement -

Audit on ventilator defects:PM Modi

అధికారులకు ప్రధాని ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్‌గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. ‘వెంటిలేటర్ల పనితీరుపై పలు రాష్ట్రాలనుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధాని తీవ్రంగా పరిగణించారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఈ వెంటిలేటర్లపై తక్షణం ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సరిగా పని చేస్తున్న వెంటిలేటర్ల విషయంలో అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు’ అని కేంద్రప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. దానితో పాటు కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని ప్రధాని ఈ సమావేశంలో సూచించారు. స్థానిక కంటైన్‌మెంట్ జోన్ల ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేలా, ఆక్సిజన్ కొరత లేకుండా చూసేలా వనరులను పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.

పిఎం కేర్స్ నిధుల కింద కేంద్రం గతంలో పలు రాష్ట్రాలకు వెంటిలేటర్లు సరఫరా చేసింది. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ట్విట్టర్‌లో కూడా పేర్కొన్నారు. వాటి సేకరణపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మే నెల ప్రారంభంలో వారానికి దాదాపు 50 లక్షల టెస్టులు జరుగుతుండగా ఇప్పడు ఆ సంఖ్య వారానికి దాదాపు 1.1 కోట్లకు పెరిగినట్లు వివరించారు. కాగా టీకా కార్యక్రమం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పని చేయాలని అధికారులకు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News