బ్యాంకాక్ : మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీకి సోమవారం మరో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అక్రమంగా వాకీటాకీలను దిగుమతి చేసుకుని వినియోగిస్తున్న అభియోగాలపై ఈ శిక్షను అక్కడి సైనిక ప్రభుత్వ న్యాయస్థానం విధించింది. గత నెల మరో రెండు కేసులపై నాలుగేళ్ల జైలు శిక్ష పడగా, మిలిటరీ ప్రభుత్వం ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఇప్పుడు విధించిన నాలుగేళ్లతో కలిపి మొత్తం ఆరేళ్లు శిక్ష గడపవలసి వస్తుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 76 ఏళ్ల అంగ్‌సాన్ సూకీపై అక్కడి సైనిక ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పదుల సంఖ్యలో కేసులను బనాయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో మిలిటరీ అక్కడి పాలనను హస్తగతం చేసుకుంది. ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తొలగించి సూకీని ఆమె నేషనల్ ఫర్ డెమొక్రసీ పార్టీ అగ్రనేతలను నిర్బంధంలో పెట్టింది. ఆమెపై మోపిన కేసులన్నీ విచారణలో దోషిగా తేలితే సూకీ వందేళ్లుకు మించి జైలులో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. మిలిటరీ చేజిక్కించుకున్న అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి, రాజకీయాల్లోకి సూకీ తిరిగి రాకుండా చేయడానికి ఈ కేసులను బనాయించారని సూకీ మద్దతుదారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దేశ రాజధాని నైపితాలో సోమవారం ఈ కేసులో విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో మీడియాను కానీ, సూకీ తరఫు న్యాయవాదులను కానీ అనుమతించలేదు.