మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు, ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులయినట్టూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు కాక సరైన మాటలు ఎలా మాట్లాడుతారు? భారత తొలి ప్రధాని, దేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దార్శనికతను అర్థం చేసుకోలేని మూర్ఖ ప్రముఖులు నిజాలు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది లేదా సామాన్య ప్రజలు నిజాలు తెలుసుకొని చైతన్యవంతులై, ఇక ముందు అబద్ధాలు ప్రచారం చేసే వారి ప్రభావంలో పడకుండా వుంటారు.
రాబోయే ఎన్నికల్లో అలాంటి వారిని మట్టి కరిపిస్తారు. నిజాల్ని బతికిస్తారు. ఘనమైన దేశ చరిత్రను కాపాడుకుంటారు. అంతకంటే ముందు పట్టణాల, నగరాల పేర్లు మార్చుకున్నందు వల్ల చరిత్ర మారదని తెలుసుకోవడం అవసరం. బ్రిటీష్ వారు ఈ దేశాన్ని దోచుకుపోయారు. మొఘలులు అలా కాదు, ఇది తమ మాతృభూమి అనుకొని, ఇక్కడి నేలలో, ఇక్కడి గాలిలో, ఇక్కడి ఉమ్మడి సంస్కృతిలో భాగమైపోయారు. ఇక్కడి లౌకిక వాదాన్ని అపురూపంగా కాపాడారు. ఎవరైనా సరే, ఈ సున్నితమైన అంశం తెలుసుకోగలిగితేనే ఈ దేశపు నాడిని పట్టుకోగలుగుతారు.
ఔరంగజేబు అనేది మొఘల్ చక్రవర్తి అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు ముజఫర్ మొహియొద్దీన్ అలంఘీర్! మరి ఈ ఔరంగజేబు అనే పేరు ఎలా వచ్చింది? తెలుసుకోవాలంటే కొంచెం వివరాల్లోకి వెళ్ళాలి. షాహీ మజ్జీద్ పక్కనే ఔరంగజేబు నివసించే మహల్ వుండేది. ప్రతిరోజు ఉదయం చక్రవర్తి మహల్‌పైన చల్లగాలికి పచార్లు చేస్తుండేవాడు. కొంత దూరంలో పొగలు పైకి లేస్తూ కనబడేవి. అదేమిటని తెలుసుకొంటే, కొంత మంది అక్కడ వంట చేసుకుంటున్నారని తెలిసింది. సరే, కొన్ని రోజుల తర్వాత ఆయన అటు వైపు పరీక్షగా చూస్తే, ఒక చోటు నుండి పొగ రావడం లేదు. కాని, మనుషులు కనిపిస్తుండే వారు. ‘వీళ్ళేమిటీ? వండుకోకుండా ఏం తింటున్నారూ?’ అని వాకబు చేస్తే, మరి కొన్ని విషయాలు తెలిశాయి.
పొగరాని ఆ చోట ఒక మందిరం ఉందనీ, దాని చుట్టూ కొంత మంది బ్రాహ్మణులు వుంటున్నారని, అయితే వారు వంట చేసుకొని తినరని, భిక్షాటన చేసి, బతుకు వెళ్ళబోస్తున్నారని తెలిసింది. విషయం తెలియగానే చక్రవర్తి మనసు కరిగిపోయింది. నేను వుండగా ప్రజలు కొంత మంది భిక్షాటన చేసి బతకడమేమిటీ? అలాంటప్పుడు ఇక తను వుండి ఏం లాభం అనుకుని, బ్రాహ్మణులందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేశాడు. వారికి నచ్చే విధంగా, వారి పద్ధతిలో వంటలు చేయించి వారి కోసం ప్రత్యేక భోజనశాల (మెస్) ఏర్పాటు చేయించాడు. బ్రాహ్మణులంతా సమయానికి అక్కడికి వెళ్ళి, ఉచితంగా భోజనం చెయ్యొచ్చు. పూట పూటకు తిండి కోసం వెతుక్కోకుండా సమయానికి మంచి భోజనం దొరుకుతున్నందుకు బ్రాహ్మణ వర్గమంతా సంతోషించింది. తాము వుండే చోట పొగరానందుకు షెహన్ షా (చక్రవర్తి) తమ పరిస్థితిని తెలుసుకొని, తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతా భావంతో వినమ్రులయ్యారు.
చక్రవర్తికి ఒక మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పౌరోహిత్యంతో తాము సంపాదించింది అంతా పోగేశారు. తాము ఇచ్చే బహుమతి గొప్పగా వుండాలనుకున్నారు. చివరకు ఒక గద్దె (సింహాసనం) తయారు చేయించారు. దాని నిండా రంగు రంగుల మెరిసే రాళ్ళు పొదిగారు. తిరంగ్ అంటే మూడు, నవ్‌రంగ్ అంటే తొమ్మిది అలాగే ఇంకా ఎక్కువ రాళ్ళు పొదిగితే గనక, దాన్ని ‘ఔరంగ్’ అని పిలుస్తారు. జేబ్ అంటే బేబు పర్సు బహుమతి అని అర్థం. ఒక ఫారసీ పండితుడు ఆ బహుమతిని ‘ఔరంగజేబ్’ అని వర్ణించాడు. ( రంగు రాళ్ళు అధికంగా పొదిగి తయారు చేసిన ప్రకాశవంతమైన బహుమతి అని అర్థం) తన తర్వాత ఈ గద్దె మీద కూర్చుని ఎవరు రాజ్యమేలినా వారు ఔరంగజేబ్ అని పిలవబడతారని చక్రవర్తి (అలంఘీర్) ప్రకటించాడు. ఆ రకంగా ఆయనకు ఔరంగజేబ్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఏ ప్రాంతపు బ్రాహ్మణులు ఆ బహుమతిని అందించారో ఆ ప్రాంతం పేరు ఔరంగపూర్. అందువల్ల ఆ బహుమతికి ఆ బహుమతి స్వీకరించిన చక్రవర్తికీ ఆ పేరు మరింతగా సరిపోయింది. ఇందులో హిందూ ముస్లింల ప్రసక్తి లేదు. మత ప్రసక్తి అసలే లేదు. ఒక చక్రవర్తి ఔదార్యం, ప్రజల ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉన్నాయి. ఔరంగాబాద్ నగరానికి పేరు మార్చాలనుకునేవారు ఇలాంటి చారిత్రక సత్యాలు తెలుసుకుంటే బావుంటుంది. ఇవన్నీ ఆర్కియాలజీ శాఖలో ఉన్నతాధికారి చెప్పిన వాస్తవాలు. కల్పితాలు ఏ మాత్రం కాదు. మత ప్రసంగాలు చేస్తూ, జనాన్ని విడగొట్టడానికి అడ్డమైన అబద్ధాల కథలు ప్రచారం చేసే వారి ఆట కట్టించాలంటే దేశ పౌరులు నిజాలు తెలుసుకుంటూ వుండాలి. ఘనమైన ఈ దేశ చరిత్రను ఎప్పుడూ ఎక్కడా దిగజార్చకూడదు.
“ఏజాతి అయినా అభివృద్ధి చెందాలంటే సైన్సు, గణితం, సాహిత్యంపై ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించడం అవసరం. అంతేగాని, ఐదు వేల సంవత్సరాల క్రితం తమ పూర్వీకులు సైన్సు, గణితం, సాహిత్య రంగాలలో ఏం చేశారో చూపించుకోవడం కాదు. మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతుల వాసన చూడండి అనే పద్ధతి ఇక మానుకోవాలి. తప్పదు” అని అన్నారు ప్రపంచ బ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్టు, భారతీయ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ కౌశిక్ బసు. అసలు ఐదు వేల ఏళ్ళ క్రితం వున్న సైన్సు, గణితం, సాహిత్యాల రూపురేఖలేమిటో తెలుసుకోవాలి కదా? అసలు అవి ఆ కాలానికి అభివృద్ధే చెందలేదు. వాటి గూర్చి గొప్పగా మాట్లాడడంలో అర్థం లేదు. “వైజ్ఞానిక స్పృహతో తప్ప ఈ దేశం ముందుకు పోదు” అని చెప్పిన ఈ దేశ నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్థాయిని తగ్గించాలని చూసే వారు త్వరలో అడ్రసు లేకుండా పోతారు. తప్పదు. ప్రాజెక్టులు, పరిశోధనా శాలలు, ఆసుపత్రులే అత్యాధునిక దేవాలయాలని ఆయన కొత్త నిర్వచనాన్నిచ్చారు.
భారత దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ నెహ్రూ గురించి ఏమన్నారో చూడండి. “గత ముప్పయి ఏళ్ళుగా లేదా అంతకు మించి భారత దేశ చరిత్ర జవహర్ లాల్ నెహ్రూ కార్యకలాపాలతో ఎంతో ప్రభావితం చెందింది. స్వాతంత్య్ర సమరంలో ముందు నిలిచిన సేనాని ఆయన! నా కన్నా ఎక్కువ సార్లు జైలుకు వెళ్ళారు. నా కన్నా ఎక్కువ కాలం జైల్లో గడిపారు. ఆయన త్యాగాల్ని, కృషిని గుర్తు చేసుకోకుండా ఈ దేశ చరిత్ర ముందుకు సాగదు అని! స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకోని ‘దేశభక్తులు’ ఇప్పుడు అధికారంలో వున్నారు. వారికి ఇలాంటివి ఎప్పుడు అర్థం కావాలి! వాళ్ళకంటూ ఓ చెప్పుకోదగ్గ నాయకుడు లేడు కాబట్టి. తమ గుజరాతీ కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం ప్రతిష్టాపించుకున్నారు. దాని వల్ల నెహ్రూ స్థాయి తగ్గుతుందని భ్రమ పడ్డారు. కానీ, నెహ్రూ జీ గురించి సర్దార్ పటేల్ 1948లో ఏమన్నారో నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన గ్రంథంలో (490 పేజీ) వుంది. “పండిట్ జవహర్ లాల్ నెహ్రూను మహాత్మాగాంధీ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. గాంధీ మరణం తర్వాత నెహ్రూ నాయకత్వం చూసి మేమంతా గర్వపడ్డాము. గాంధీజీ నిర్ణయం ఎంత సరైనదో అన్నది మాకు అర్థమైంది. ప్రత్యక్షంగా చూశాం కూడా!” ఇలాంటి విషయాలు ఈ దేశ ప్రజలు తెలుసుకోలేరని పాపం ప్రస్తుత పాలకులు భ్రమల్లో బతుకుతుంటారు.
నిజానికి దేశ విభజనకు కాంగ్రెస్ ఎప్పుడూ సుముఖంగా లేదు. హిందూ మహాసభ ఒక వైపు, ముస్లిం లీగ్ మరొక వైపు చేతులు కలిపి దేశంలో ద్వేష భావాన్ని వ్యాపింప చేస్తూ అల్లర్లు చేస్తూ, దాడులు చేస్తూ వున్నప్పుడు వాటిని ఆపడానికి, ప్రాణ నష్టం ఇంకా ఇంకా కనసాగకుండా వుండడానికి విధిలేని పరిస్థితుల్లో మహాత్మా గాంధీ దేశ విభజనకు సమ్మతించారు. అంతేగాని, నెహ్రూ తొలి ప్రధాని కావాలని కాంగ్రెస్ కుట్రలు చేయలేదు. దేశం విడిపోకపోతే, భారత్ ప్రజాస్వామ్య దేశంగా ఎదగకపోతే… ఇన్నేళ్ళ తర్వాత నైనా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ముసుగు వేసుకొని అధికారంలోకి వచ్చేది కాదు. ఆనాడు దేశం విడిపోకపోతే వీరు ఈనాడు అధికారంలోకి వచ్చే వారు కాదు. మోడీ ప్రధాని అయ్యుండే వారు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వచ్చిన ముందు తరం దేశ నాయకుల్ని తప్పకుండా అభినందించాలి. మోడీ మీడియా నెహ్రూజీని తక్కువ చేసి చూపాలనుకుంటోంది. కాని, ఆనాడు నెహ్రూ జీ ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దికపోతే అసలు ఈ రోజు మోడీ గాని, బిజెపి గాని ఎక్కడ వుండేవీ? యదార్థం గ్రహించి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వారినే అడ్డుకోవాల్సి వుందని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు.
కర్తవ్యోన్ముఖులవుతున్నారు. కేవలం తుపాకులతో కాల్చడం, బాంబులను పేల్చడం ఉగ్రవాదం కాదు. ప్రజలను కులాలుగా, మతాలుగా విభజించడం కూడా అతి భయంకరమైన ఉగ్రవాదం! ఈ రకంగా చేస్తే, మనువాదులను మించిన ఉగ్రవాదులు ఈ దేశంలో లేరు. మొఘలులయినా, నెహ్రూజీ అయినా ఈ దేశ ప్రజల్ని ప్రేమించారు. విభజించలేదు. ఇష్టానికి, ప్రేమకు వున్న తేడాను బుద్ధుడు బోధించాడు. తోటలో ఒక పువ్వు నిన్ను ఆకర్షించింది. వెంటనే వెళ్ళి కోసుకోవడం ఇష్టం. ఆ పువ్వు పూసిన మొక్కకు నీళ్ళు పోసి, దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడమే ప్రేమ! ఆ తేడా తెలుసుకుంటే జీవితానికి అర్థం ఏమిటో అర్థమవుతుంది! మొక్కంటే మొక్కే కాదు సమాజమూ అందులోని మనుషులు అని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది.