బోర్డర్‌గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆతిథ్య ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెరీర్ తొలి టెస్టు ఆడుతున్న యువ ఆటగాడు సామ్ కోన్‌స్టాస్(60), ఉష్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72), స్టీవ్ స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
కొంప ముంచిన కోన్‌స్టాస్..
అరంగేట్రం ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లక్షంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇక, ఎన్నడూ లేని విధంగా తొలి 6 ఓవర్లలోనే 38 పరుగులు ఇచ్చుకున్నాడు బు మ్రా. ఈ క్రమంలో సామ్ కోన్‌స్టాస్ 52 బం తుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పేసర్లను అలవోకగా ఆడుతున్న కోన్‌స్టాస్‌ను కట్టడి చేసేందు కు కెప్టెన్ రోహిత్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను బరిలోకి దించాడు. జడేజా వేసిన తొలి ఓవర్‌లోనే కోన్‌స్టాస్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
దాంతో తొలి వికెట్‌కు నమోదైన 89 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇనింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా లంచ్ బ్రేక్ సమయానికి 112/1 స్కోర్‌తో చేయగలిగింది. రెండో సెషన్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజా 101 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. ఉస్మాన్ ఖవాజాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి స్టీవ్ స్మిత్ రాగా.. లబుషే న్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో పరుగులు చే శాడు. దాంతో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 176 పరగులు చేసింది.
హెడ్‌కు బుమ్రా చెక్..
మూడో సెషన్‌లో ప్రారంభం నుంచే ఈ జోడీ భారత బౌలర్లపై దూకుడు ప్రదర్శించింది. వేగంగా పరుగులు రాబట్టింది. లబుషేన్ 114 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్ 71 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. సెంచరీ దిశగా సాగిన లబుషేన్‌ను వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి, పెవిలియన్‌కు పంపాడు. దాంతో రెండో టెస్టులో చెలరేగి ఆడిన హెడ్ ఔట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా తన మరుసటి ఓవర్‌లోనే మిచెల్ మార్ష్(4)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలోనే అలెక్స్ క్యారీతో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 6వ వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం.. అలెక్స్ క్యారీ(31)ని ఆకాశ్ దీప్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి ప్యాట్ కమిన్స్ రాగా.. మరో వికెట్ పడకుండా స్మిత్ జాగ్రత్తగా ఆడాడు.