Tuesday, February 25, 2025

జోరు మీదున్న ఆస్ట్రేలియా….. నేడు సౌతాఫ్రికాతో పోరు

- Advertisement -
- Advertisement -

రావల్పిండి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు టోర్నీలో ఒక్కో విజయం సాధించాయి. అఫ్గాన్‌పై సౌతాఫ్రికా జయకేతనం ఎగుర వేయగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై రికార్డు విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సఫారీ టీమ్‌ను కూడా ఓడించి సెమీస్ మార్గాన్ని సుగమం చేసుకోవాలని భావిస్తోంది. సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

ఆత్మవిశ్వాసంతో..

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బలమైన ఇంగ్లండ్‌ను ఓడించడంతో జట్టులో కొత్త జోష్ నెలకొంది. కీలక ఆటగాళ్లు లేకున్నా ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో భారీ 352 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. ట్రావిస్ హెడ్ ఫామ్‌లో లేక పోవడం ఒక్కటే జట్టును కలవరానికి గురి చేస్తోంది. హెడ్ గాడిలో పడితే ఆస్ట్రేలియా గెలుపు అవకాశాలకు ఢోకానే ఉండదు. హెడ్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంది. ఇక మాథ్యూ షార్ట్ తొలి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి. మార్నస్ లబుషన్ కూడా జోరుమీదున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించిన వికెట్ కీపర్ జోష్ ఇంగ్లింస్ మరోసారి అలాంటి ప్రదర్శననే జట్టు కోరుకుంటోంది. ఇంగ్లింస్ కిందటి మ్యాచ్‌లో 86 బంతుల్లోనే అజేయంగా 120 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అలెక్స్ కారే కూడా అర్ధ సెంచరీతో మెరిశాడు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడంతో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

విజయమే లక్షంగా..

మరోవైపు సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై భారీ విజయం సాధించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అఫ్గాన్‌పై రియాన్ రికెల్టన్ అద్భుత శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ బవుమా, వండర్ డుసెన్, మార్‌క్రమ్‌లు కూడా అర్ధ సెంచరీలతో రాణించారు. ఈసారి కూడా జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న సౌతాఫ్రికాకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News