జాతక చక్రంలో కొన్ని యోగాలు కలుగుతుంటాయి. వాటిలో కొన్నింటిని ఇస్తున్నాం.
1. పంచానన యోగం
జాతక చక్రంలో గ్రహాలన్నీ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. ఇటువంటి జాతకునికి అన్నవస్త్రాదులు పుష్కలంగా ఉంటాయి.
2. నీచభంగ రాజయోగం
జాతక చక్రంలో లగ్నమందు నీచగ్రహం ఉన్నప్పుడు లగ్నాధిపతి గానీ, ఏ గ్రహమునకు ఆ లగ్నం ఉచ్ఛయగునో ఆ గ్రహము గానీ చంద్రుని లగాయతు కేంద్ర స్థానంలో ఉంటే లగ్నమందు ఉన్న గ్రహానికి నీచస్థితి తొలగి ఆ గ్రహ దశలో రాజయోగం కలుగుతుంది.
3. ఉచ్ఛగ్రహ యోగం
జాతక చక్రంలో రెండు గ్రహాలు ఉచ్ఛయందు ఉంటే ఆ జాతకుడు జీవితాంతం భాగ్యవంతుడు కాగలడు.
4. విపరీత రాజయోగం
6, 8, 12 స్థానాధిపతులు ముగ్గురూ గానీ లేదా ఇద్దరు గానీ 6, 8, 12 స్థానాలలో కలియుట లేక ఒకరి స్థానంలో మరొకరు గానీ ఉంటే ఆయా గ్రహాల దశలలో జాతకునికి విపరీత రాజయోగం కలుగుతుంది.
5. అధియోగం
జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి లగాయతు 6, 7, 8 స్థానాలలో ఏ స్థానమందైనా శుభగ్రహములు ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఆయా స్థానాలలో ఒక్క గ్రహముంటే కీర్తిగల వ్యక్తి కాగలరు. రెండు గ్రహాలు ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మూడు గ్రహాలు ఉంటే మహారాజయోగం అనుభవిస్తారు. అయితే ఈ స్థానాలకు ఎటువంటి దోషములు లేకుండా శుభగ్రహాలు బలంగా ఉండాలి.
6. బుధాదిత్యయోగం
జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిధునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.
7. గజకేసరీ యోగం
గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు.
8. చంద్రమంగళ యోగం
జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది. ఈ యోగం కలిగిన వారు భాగ్యవంతులు కాగలరు.