పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. శ్రీలంక పర్యటనలో పాల్గొనని కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో, ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన జట్టులో సీన్ అబాట్ కు మాత్రమే జట్టులో చోటు దక్కలేదు.
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ లో గాయపడిన కమిన్స్ కోలుకోకపోతే.. అబాట్ ను జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. ఇక, డేవిడ్ వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్‌తో కలిసి షార్ట్ ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు. జోష్ ఇంగ్లిస్ లేదా అలెక్స్ కారీలలో ఒకరు వికెట్ కీపర్ స్థానాన్ని కైవసం చేసుకుంటారు. కాగా, గ్రూప్ బిలో నాలుగు జట్లలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఉన్నాయి. తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22వ తేదీ శనివారం లాహోర్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.