Sunday, December 22, 2024

కమిన్స్ హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్ సూపర్8 పోరులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 28 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు సాధించింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ముందుకు తగ్గలేదు. తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు శుభారం అందించారు.

ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపారు. వార్నర్, హెడ్‌లు ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియాకు మెరుగైన ఆరంభం లభించింది. హెడ్ 21 బంతుల్లో 2 సిక్సర్లు, మూడు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 65 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ (1) మరోసారి విఫలమయ్యాడు. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ 14(నాటౌట్)తో కలిసి వార్నర్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 35 బంతుల్లోనే 3 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

కమిన్స్ హ్యాట్రిక్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. కెప్టెన్ షాంటో, తౌహిద్ హృదయ్ మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన షాంటో 36 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన తౌహిద్ 28 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. మిగతా వారిలో వికెట్ కీపర్ లిటన్ దాస్ (16), తస్కిన్ అహ్మద్ 13 (నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అలరించాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

కమిన్స్ వరుస బంతుల్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మహ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదయ్‌లను ఔట్ చేశాడు. దీంతో కమిన్స్ ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. ఓవరాల్‌గా టి20 వరల్డ్‌కప్‌లో ఇలాంటి రికార్డు నమోదు కావడం ఇది ఏడో సారి. బ్రెట్‌లీ (ఆస్ట్రేలియా), కర్టిస్ క్యాంఫర్ (ఐర్లాండ్), వనిందు హసరంగ (శ్రీలంక), కగిసో రబడా (సౌతాఫ్రికా), కార్తిక్ మైయప్పన్ (యుఎఇ), జోష్ లిటిల్ (ఐర్లాండ్)లు ఇంతకుముందు టి20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌లను నమోదు చేశారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News