Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: పాకిస్థాన్‌తో జరిగిన మూడో చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 30 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం నాలుగో రోజు పాకిస్థాన్ ఉంచిన 130 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్, వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌లు అర్ధ సెంచరీలతో ఆస్ట్రేలియాను గెలిపించారు. ఆఖరి మ్యాచ్‌లో వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వార్నర్ 75 బంతుల్లో ఏడు ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇదే క్రమంలో రెండో వికెట్‌కు 119 పరుగులను జోడించాడు. కాగా, లబుషేన్ 9 బౌండరీలతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కంగారూలు అలవోక విజయాన్ని అందుకున్నారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో సాజిద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సయిమ్ అయూబ్ (33), బాబర్ ఆజమ్ (23), వికెట్ కీపర్ రిజ్వాన్ (28), ఆమేర్ జమాల్ (18) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ నాలుగు, లియాన్ మూడు వికెట్లను పడగొట్టారు. కాగా, పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు జరిగిన తొలి రెండు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News