Sunday, January 19, 2025

చివరి మెట్టుపై భారత్ బోల్తా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే టీమిండియా ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాకు ఇది వన్డేల్లో రికార్డు స్థాయిలో ఆరో వరల్డ్‌కప్ ట్రోఫీ కావడంవిశేషం. మరోవైపు మూడోసారి విశ్వవిజేతగా నిలువాలని భావించిన భారత్‌కు నిరాశే మిగిలింది. వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2003లో కూడా భారత్ తుదిపోరులో కంగారూల చేతిలో పరాజయం చవిచూసింది. ఇక కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో జరిగిన ఫైనల్లో ఆతిథ్య భారత్ పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోర వైఫల్యం చవిచూసింది. దీంతో 130 కోట్ల మంది భారతీయులు నిరాశలో మునిగిపోయారు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఆడిన పది మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమిండియా తుదిపోరులో ఆ సంప్రదాయాన్ని కొనసాగించడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న హెడ్, లబుషేన్
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం అభించలేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ షమికి దక్కింది. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం తన జోరును కొనసాగించాడు. అద్భుత షాట్లతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కానీ మిఛెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించినట్టే కనిపించింది. అయితే తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ పోరాటం కొనసాగించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. లబుషేన్ పూర్తి ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశాడు. హెడ్ మాత్రం అడపాదడపా ఫోర్లతో స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చారిత్రక బ్యాటింగ్‌తో హెడ్ ఆస్ట్రేలియాను పటిష్టస్థితికి చేర్చాడు. అతని అసాధారణ ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 137 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో లబుషేన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 192 పరుగులు జోడించాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన లబుషేన్ 110 బంతుల్లో 4 ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఆరంభంలోనే..
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లితో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ధాటిగా ఆడిన రోహిత్ 31 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న రోహిత్‌ను మ్యాక్స్‌వెల్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (4) కూడా ఔటయ్యాడు. కానీ వికెట్ కీపర్ రాహుల్‌తో కలిసి కోహ్లి స్కోరును ముందుకు నడిపించాడు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 4 ఫోర్లతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 240 పరుగుల వద్దే ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు, హాజిల్‌వుడ్, కమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు దక్కింది. మరోవైపు భారత స్టార్ విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News