Friday, November 22, 2024

సెమీస్‌లో ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

మళ్లీ ఓడిన భారత్, ఇక నాకౌట్ బెర్త్ కష్టమే!

Australia reached semis in Ind vs Aus
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు టీమిండియా మరో ఓటమి సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప భారత్ సెమీస్‌కు చేరడం కష్టమేనని చెప్పాలి. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

శుభారంభం..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు రేచల్ హేన్స్, అలిస్సా హేలీ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముదుకు తీసుకెళ్లారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి జట్టును పటిష్టస్థితికి చేర్చారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హేలీ 65 బంతుల్లోనే 9 ఫోర్లతో 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రేచల్ హేన్స్ ఐదు బౌండరీలతో 43 పరుగులు సాధించింది.

కదంతొక్కిన లానింగ్..

మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించింది. ఎలిసె పేరితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లింది. లానింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆమెకు పేరి తనవంతు సహకారం అందించింది. ఇద్దరి మధ్య కీలక భాగస్వామ్యం నెలకొంది. సమన్వయంతో ఆడిన పేరి 28 పరుగులు చేసి వెనుదిరిగింది. ఇక భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లానింగ్ 107 బంతుల్లో 13 ఫోర్లతో 97 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో 3 పరుగుల తేడాతో శతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక బెత్ మూని 30 (నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి ఆస్ట్రేలియాను గెలిపించింది.

ఆదుకున్న మిథాలీ, భాటియా

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ షఫాలి వర్మ (12) ఈసారి కూడా నిరాశ పరిచింది. దీంతో భారత్ 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన యస్తిక భాటియాతో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన భాటియా ఆరు ఫోర్లతో 59 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన మిథాలీ రాజ్ 68 పరుగులు సాధించింది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు ఫోర్లతో 57 (నాటౌట్) కూడా తనవంతు పాత్ర పోషించింది. పూజా వస్త్రాకర్ (34) కూడా ధాటిగా ఆడడంతో భారత్ స్కోరు 277 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News