ఆస్ట్రేలియాలో చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం
నేడు పార్లమెంటు ముందుకు చట్టం
కాన్‌బెర్రా: గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా సంస్థలు తమ వార్తలకు తామే ఏక మొత్తంగా సొమ్ము చెల్లించే విధంగా చట్టాల్లో సవరణలు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వార్తా కథనంపై జరిపే క్లిక్‌ల ఆధారంగా సొమ్ము చెల్లించే వారు. అయితే ఇకపై అలా కాకుండా ఏకమొత్తగా వార్తా కథనాలకు కలిపి ఆ సంస్థలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆల్ఫాబెట్ దాని అనుబంధ సంస్థ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్‌తో ఆస్ట్రేలియా మంత్రులు గత వారాంతంలో చర్చలు జరిపిన దరిమిలా చట్టలో ఈ మార్పులు తీసుకు రావాలని ప్రభుత్వం భావించింది. వీటిని ప్రభుత్వం ‘వివరణలు, సాంకేతిక సవరణలు’ గా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ నెల 25న ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగానే న్యూస్ మీడియా బారర్గెనింగ్ కోడ్‌గా పిలవబడే ఈ చట్టాన్ని ఆమోదించగలమని మితవాద ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ కోడ్ మొత్తం ప్రభావంపై ఎలాంటి ప్రభావం లేకుండా దీని పనితీరును మెరుగునర్చడానికి బుధవారం ఈ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి జోష్‌ఫ్రిడెన్‌బర్గ్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పౌల్ ఫ్లెచర్ ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. కాగా సెనేట్‌లో ప్రభుత్వానికి ఈ సవరణను ఆమోదించడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు లేని నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇస్తామని మంగళవారం జరిగిన ఎంపిల సమావేశంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే సెనేట్‌లో ప్రతిపక్షాలు చేసే సవరణల విషయంలో ప్రభుత్వం రాజీ పడాల్సి ఉంటుందని అంటున్నారు.