ఇండోర్ : వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తొలి రెండు టెస్టుల్లో గెలవడంతో ఇండోర్‌లోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకోగా టీమిండియా ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఏమాత్రం ఆశలు లేకుండానే బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయ ఆటతో అలరించింది. ముఖ్యంగా స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ చారిత్రక బౌలింగ్ ప్రదర్శనతో భారత్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. రెండున్నర రోజుల్లోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 109 కుప్పకూల్చడంతో కంగారూల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. ఇదే క్రమంలో కీలకమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కీలక బౌలర్ నాథన్ లియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్‌గా పేరున్న టీమిండియాను లియాన్ తన స్పిన్ బౌలింగ్‌తో హడలెత్తించాడు. అద్భుతంగా రాణించిన లియాన్ ఏకంగా 8 వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియాను తిరుగులేని స్థితిలో నిలిపాడు. లియాన్ దెబ్బకు భారత బ్యాటర్లు ఒకరి వెంట ఒకరూ పెవిలియన్ చేరారు. ఒక్క చటేశ్వర్ పుజారా మాత్రమే ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మిగతావారు విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఇక టీమిండియా ఉంచిన సునాయాస లక్ష్యాన్ని కంగారూలు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు.
వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యం
మరోవైపు ఈ సిరీస్‌లో టీమిండియాను బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతోంది. రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రాహుల్, జడేజా, అశ్విన్, పుజారా వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. రెండో టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీన్ని బట్టి భారత బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా కోహ్లి వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ విరాట్ విఫలమయ్యాడు.
ఒక్కసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. కెప్టెన్ రోహిత్‌లో కూడా నిలకడ లోపించింది. అతను కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా విఫలమయ్యాడు. పుజారా, శ్రేయస్ అయ్యర్‌లు కూడా అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. ఇలా కీలక ఆటగాళ్లందరూ బ్యాటింగ్‌లో తడబడుతుండడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం చివరి టెస్టులోనైనా బ్యాటర్లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.