Sunday, January 19, 2025

ధర్మశాలలో పరుగుల సునామీ

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన హోరాహోరీ సమరంలో కివీస్ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

రవీంద్ర పోరాటం..
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు చేపట్టిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవోన్ కాన్వే, విల్ యంగ్‌లు మెరుపు ఆరంభాన్ని అందించారు. ధాటిగా ఆడిన కాన్వే 17 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మరోవైపు యంగ్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో కివీస్ 72 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను డారిల్ మిఛెల్, రచిన్ రవీంద్ర తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన మిఛెల్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 54 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ టామ్ లాథమ్ కూడా రచిన్‌కు అండగా నిలిచాడు. అయితే లాథమ్ 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ (12)తో కలిసి రచిన్ పోరాటం కొనసాగించాడు. చెలరేగి ఆడిన రచిన్ 89 బంతుల్లోనే 9 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 116 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యత జేమ్స్ నిషమ్ తనపై వేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన నిషమ్ 3ఫోర్లు, మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. దీంతో కివీస్‌కు ఐదు పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

కదంతొక్కిన వార్నర్, ట్రావిస్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌లు మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. వీరిని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు వార్నర్, అటు ట్రావిస్ వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. దీంతో పరుగుల వరద పారింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ ఆరు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 81 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు.మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన ట్రావిస్ హెడ్ 67 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, పది ఫోర్లతో 109 పరుగులు చేశాడు. చివర్లో మాక్స్‌వెల్ (41), కమిన్స్ (37), జోష్ ఇంగ్లిస్ (38) వేగంగా ఆడడంతో ఆస్ట్రేలియా స్కోరు 388 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి రికార్డు స్థాయిలో 771 పరుగులు నమోదు చేయడం విశేషం. ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో ఇదే అత్యధిక పరుగులు కావడం గమనార్హం. కాగా, ఈ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా, కివీస్ చివరి రెండు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News