క్రికెట్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఒకటి ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మహిళల వన్డే మ్యాచ్ లో జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్ అలాసా క్లాస్ 48వ ఓవర్లో వేసిన ఒక బంతికి సిక్స్ కొట్టింది. అదే ఊపులో ఆమె చేతిలోని బ్యాట్.. వికెట్లకు తగిలి బెయిల్స్ ను పడేసింది. హిట్ వికెట్ అన్నమాట. అయినా ఆమె ఔట్ కాలేదు. పైగా ఏడు రన్స్ వచ్చాయి. ఎలాగో తెలుసా?
48వ ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ మసబాట క్లాస్ స్లో బాల్ వేసేందుకు ప్రయత్నించింది. బంతి క్రీజులో ఉన్న అలానా కింగ్ భుజాల దాకా వచ్చింది. దాన్ని ఒక కాలిపై వంగుతూ డీప్ స్క్వేర్ లెగ్ లో సిక్సర్ కొట్టింది. అదే ఊపులో బ్యాట్ ను వికెట్లకు తాకించింది. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. మసబాట క్లాస్ బౌల్ చేయగానే లెగ్ అంపైర్ అది నో బాల్ అని ప్రకటించాడు. ఇది తెలియని బ్యాటర్ కింగ్.. ఔటయ్యాననుకుంది. నో బాల్ కావడంతో ఆ బంతికి ఏడు పరుగులు వచ్చాయి!
అక్కడితో అయిపోలేదు. అలానా కింగ్ బౌలింగ్ లోనూ అదరగొట్టింది. ఐదు ఓవర్లలో 26 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు డిఎల్ఎస్ పద్ధతిలో 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.