Friday, November 22, 2024

ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షే!

- Advertisement -
- Advertisement -

దుబాయి: ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఎదురులేని శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం కంగారూ జట్టును వెన్నతో పెట్టిన విద్య. వన్డేలు, టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎన్నో చారిత్రక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే పొట్టి క్రికెట్ టి20 ఫార్మాట్‌కు వచ్చే సరికి కంగారూలకు ఒక ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అదే టి20 వరల్డ్‌కప్ టైటిల్. వన్డేల్లో ఇప్పటికే రికార్డు స్థాయిలో ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన ఆస్ట్రేలియా టి20లో మాత్రం ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలువలేక పోయింది. ప్రతిసారి ఆస్ట్రేలియా ఖాళీ చేతులతోనే ఇంటిదారి పడుతూ వస్తోంది. వెస్టిండీస్ రెండు సార్లు, భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలు ఇప్పటికే టి20 వరల్డ్‌కప్‌లో ట్రోఫీలు గెలుచుకున్నాయి. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా మాత్రం ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని అందుకోలేక పోయింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నా కంగారూలకు ఇప్పటికీ టి20 ట్రోఫీ ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోయింది. అయితే ఈసారి యుఎఇ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న కంగారూలు ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే నిలకడలేమి ఆస్ట్రేలియాకు అతి పెద్ద సమస్యగా మారింది.
అంత తేలికేం కాదు..
ఇక గతంతో పోల్చితే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇంటాబయట ఓటములతో సతమతమవుతోంది. చివరికి బంగ్లాదేశ్ వంటి చిన్న జట్ల చేతుల్లోనే ఓటమి పాలవుతూ వస్తోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్ లేమీతో బాధపడుతున్నారు. ఒకప్పుడూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఓ వెలుగు వెలిగిన డేవిడ్ వార్నర్ కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వార్నర్ గాడిలో పడితేనే ఈ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఇక కెప్టెన్ అరోన్ ఫించ్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆల్‌రౌండర్లు మిఛెల్ మార్ష్, స్టోయినిస్, మాక్స్‌వెల్ తదితరులు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన ఐపిఎల్‌లో మాక్స్‌వెల్ నిలకడగా రాణించడం ఆస్ట్రేలియాకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈసారి అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో మాత్రం ఆస్ట్రేలియా బలంగా ఉందనే చెప్పాలి. మిఛెల్ స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, అష్టన్ అగర్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కానీ బ్యాటింగ్ వైఫల్యం కంగారూలకు ప్రతికూలంగా మారింది. ఆ లోపాన్ని సరిదిద్దు కుంటేనే ట్రోఫీలో మెరుగైన అవకాశాలుంటాయి.
మూడు సార్లు సెమీస్‌కు..
మరోవైపు గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా మూడు సార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది. అంతేగాక 2010లో ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి కనీసం సెమీస్‌కు చేరుకుంటుందా అనేది కష్టంగా మారింది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్‌లో బలమైన జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా ముందుకు వెళ్లడం అనుకున్నంత తేలికకాదు. అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని గెలుపు కోసం సర్వం ఒడ్డి పోరాడే ఆస్ట్రేలియాను తక్కువ అంచన వేయలేం. కానీ, విపరీత పోటీ నెలకొన్న విశ్వ సమరంలో విజయం అందుకోవాలంటే అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అప్పుడే కంగారూలకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Australia wants to get T20 World Cup 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News