మెల్‌బోర్న్ : యుఎఇ వేదికగా జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ దేశ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇతర జట్లతో పోల్చితే ఆస్ట్రేలియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. ఒకటి రెండు సిరీస్‌లలో ఓడినంత మాత్రాన ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేమన్నాడు. బిగ్‌బాష్, ఐపిఎల్, కరీబియన్ లీగ్ తదితర టోర్నమెంట్‌లలో ఆడడం ద్వారా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంతో రాటుదేలారన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నారన్నాడు. ఇక ఇతర జట్ల కంటే ఎంతో ముందుగానే ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిందంటే వారి ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవవచ్చన్నాడు. ఇక జోష్ ఇంగ్లిన్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడాన్ని పాంటింగ్ స్వాగతించాడు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా ఈసారి టి20 వరల్డ్‌కప్‌లోనూ చెలరేగి పోవడం ఖాయమన్నాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో ఆస్ట్రేలియా చాలా బలంగా మారిందన్నాడు. దీంతో వరల్డ్‌కప్‌లో తన ఫేవరెట్ జట్టు ఆస్ట్రేలియానే అనడంలో ఎలాంటి సందేహం లేదని పాంటింగ్ స్పష్టం చేశాడు.
ఈసారి కంగారూలదే ట్రోఫీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -