వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. 369 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. 111/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు చేపట్టిన కివీస్ 196 పరుగులకే కుప్పకూలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన రచిన్ రవీంద్ర నిరాశ పరిచాడు. రచిన్ 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన్ వికెట్ కీపర్ టామ్ బ్లుండెల్ (0), గ్లెన్ ఫిలిప్స్ (1) విఫలమయ్యారు. మిగతా వారిలో స్కాట్ కుగ్గెల్జిన్ (26), మ్యాట్ హెన్రీ (14) పరుగులు చేశారు. ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన డారిల్ మిఛెల్ 130 బంతుల్లో 38 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ ఆరు వికెట్లను పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 179 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 164 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన గ్రీన్ 174 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 34 పరుగులు సాధించాడు. గ్రీన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి క్రైస్ట్ చర్చ్‌లో జరుగనుంది.