Wednesday, January 22, 2025

టీమిండియా ఫైనల్ ఆశలు సజీవం..

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించడం భారత్‌కు కలిసి వచ్చింది. సౌతాఫ్రికా వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇది భారత్‌కు అతి పెద్ద ఊరటగా మారింది. ఇక దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న టీమిండియా కూడా టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే సౌతాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడం టీమిండియాకు ఎంతో అవసరం.

ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. అంతేగాక స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కూడా భారత్‌కు కీలకంగా మారింది. ఈ సిరీస్‌లో కనీసం 3-0 తేడాతో గెలిస్తే ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ డబ్లూటిసి కప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు అనుకున్నంత తేలికేం కాదు. కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. 14 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లోనే ఓడింది. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.

దీంతో ఆస్ట్రేలియా 78.57 శాతం రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. టీమిండియా 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. శ్రీలంక 53.33 శాతం పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించిన ఇంగ్లండ్ కూడా ఫైనల్ రేసులో నిలిచింది. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ మాత్రం (25.11) శాతం పాయింట్లతో 8వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News