చివరి టెస్టులోనూ చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా
డబ్లుటిసి ఆశలు గల్లంతు
3-1తో సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్
డబ్లుటిసి ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న ఆస్ట్రేలియా
సిడ్నీ: ఘోర పరాభావంతో ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది టీమిండియా. తీరుమారని ఫీల్డింగ్‌కు తోడు బ్యాటింగ్ వైఫల్యంతో ఆసీస్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డబ్లుటిసి ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదు టెస్ట్‌ల బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ పరాజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో కైవసం చేసుకుంది. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసకుంది. ఈ సిరీస్ విజయంతో డబ్లుటిసి 2025 ఫైనల్ చేరింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరుతో తలపడనుంది. 162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(41)రాణించగా.. ట్రావిస్ హెడ్(34 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్(39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు.
మెరిసిన బోలాండ్..
అంతకుముందు 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ 157 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(61) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(6/45) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్(3/44) మూడు వికెట్లు పడగొట్టి నడ్డీ విరిచాడు. బ్యూ వెబ్‌స్టర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఎన్నో అంచనాలతో మూడో రోజు ఆట ప్రారంభించిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 6 పరుగులు మాత్రమే జోడించారు. ఈ ఇద్దర్నీ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. జడేజా(13)ను క్యాచ్ ఔట్ చేసిన కమిన్స్.. సుందర్(12)ను క్లీన్ బౌల్ చేశాడు. మహమ్మద్ సిరాజ్(4), జస్‌ప్రిత్ బుమ్రా(0)లను ఒకే ఓవర్‌లో బోలాండ్ ఔట్ చేయడంతో భారత రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆసీస్‌కు శుభారంభం..
లక్ష్యచేధనకు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు సామ్ కోన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు. ప్రసిధ్ కృష్ణ సామ్ కోన్‌స్టాస్(22), మార్నస్ లబుషేన్(6), స్టీవ్ స్మిత్(4)లను ఔట్ చేసి ఆశలు రేకెత్తించాడు. దాంతో ఆసీస్ 71/3 స్కోర్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లో ఖవాజా మరింత దూకుడుగా ఆడాడు. ట్రావిస్ హెడ్ కూడా బౌండరీలు బాదడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఉస్మాన్ ఖవాజా(41)ను సిరాజ్ ఔట్ చేసినా.. ట్రావిస్ హెడ్‌తో కలిసి బ్యూ వెబ్‌స్టర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.