Friday, December 20, 2024

ఆస్ట్రేలియా ఓపెన్ బార్టీదే

- Advertisement -
- Advertisement -

Australian Open champion Ashley Barty

ఫైనల్లో కొలిన్స్ ఓటమి

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బార్టీ 63, 76 తేడాతో అమెరికా క్రీడాకారిణి డానియెలి కొలిన్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో బార్టీ తన ఖాతాలో మూడో సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జత చేసుకుంది. గతంలో బార్టీ వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించింది. ఇక సంచల ఆటతో ఫైనల్‌కు చేరిన అమెరికా స్టార్ కొలిన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఓడినా కొలిన్స్ అద్భుత ఆటతో అభిమానుల మనసులను గెలుచుకుంది.

ఆరంభం నుంచే..

ఇక ఫైనల్లో టాప్ సీడ్ బార్టీ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది. తన మార్క్ ఆటతో కొలిన్స్‌పై ఆధిపత్యం చెలాయించింది. చూడచక్కని షాట్లతో లక్షం వైపు నడిచింది. బార్టీ చెలరేగి ఆడడంతో కొలిన్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు కూడా పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బార్టీ సఫలమైంది. కొలిన్స్‌ను వెనక్కి నెడుతూ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్‌లో కొలిన్స్ అద్భుత ఆటను కనబరిచింది. బార్టీని హడలెత్తిస్తూ పైచేయి సాధించింది. చూడచక్కని షాట్లతో బార్టీపై విరుచుకు పడిన కొలిన్స్ పటిష్టస్థితికి చేరింది. ఒక దశలో బార్టీ 15 తేడాతో వెనుకబడి పోయింది. కానీ ఒత్తిడిని సయితం తట్టుకుంటూ బార్టీ ముందుకు సాగింది. కొలిన్స్ జోరుకు బ్రేక్ వేస్తూ మళ్లీ పైచేయి సాధించింది. తన మార్క్ షాట్లతో చెలరేగిన బార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

కొలిన్స్‌ను ఒత్తిడికి గురి చేస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది. ఇక ఈ టైటిల్ సాధించిన రెండో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ చరిత్ర సృష్టించింది. 1978లో క్రిస్టినా ఓనిల్ ఆస్ట్రేలియాకు తొలి టైటిల్‌ను అందించింది. మరోవైపు 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బార్టీ రెండో ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీని అందించింది. కాగా, తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన కొలిన్స్‌కు నిరాశే మిగిలింది. ట్రోఫీని సాధించాలనే కొలిన్స్ ఆశలపై బార్టీ నీళ్లు చల్లింది. రెండో సెట్‌లో కొలిన్స్ అద్భుతంగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అసాధారణ పోరాట పటిమను కనబరిచిన ఆస్ట్రేలియా సంచలనం బార్టీ చాంపియన్‌గా అవతరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News