రుబ్లేవ్, సబలెంక, గాఫ్, అండ్రీవా ముందుకు..
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), అరినా సబలెంక (బెలారస్) ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో వీరిద్దరూ జయకేతనం ఎగుర వేసి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ టాప్ సీడ్ జకోవిచ్ 63, 63, 76 తేడాతో అర్జెంటీనా ఆటగాడు టొమాస్ మార్టిన్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో అలవోకగా గెలిచిన జకోవిచ్‌కు మూడో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు జోరును కొనసాగించిన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) జయభేరి మోగించాడు.
అమెరికాకు చెందిన 29వ సీడ్ కొర్డాతో జరిగిన మూడో రౌండ్‌లో రుబ్లేవ్ 62, 76, 64తో విజయం సాధించాడు. ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు లుకా వాన్‌తో జరిగిన పోరులో సిట్సిపాస్ 63, 60, 64 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సిట్సిపాస్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరోవైపు పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 12వ సీడ్ ఫ్రిట్జ్ (అమెరికా)లు కూడా ప్రీక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మినార్ 63, 63, 61తో కొబొలి (ఇటలీ)పై విజయం సాధించాడు. ఫ్రిట్జ్ హంగరీ ఆటగాడు ఫాబియన్‌ను ఓడించాడు.
అలవోకగా..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో ప్రస్తుత ఛాంపియన్ అరినా సబలెంక మూడో రౌండ్‌లో అలవోక విజయాన్ని అందుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన సురెంకోతో జరిగిన మూడో రౌండ్‌లో సబలెంక 60, 60తో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సబలెంక ప్రత్యర్థి ఒక్క గేమ్ కూడా గెలిచి అవకాశం ఇవ్వలేదు. మరో మ్యాచ్‌లో రష్యా యువ సంచలనం మీరా అండ్రీవా విజయం సాధించింది.
ఫ్రాన్స్‌కు చెందిన డయానె పారితో జరిగిన మూడో రౌండ్‌లో అండ్రీవా 16, 61, 76 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కొకొ గాఫ్ అమెరికా విజయం సాధించింది. తన దేశానికే చెందిన పార్క్‌తో జరిగిన మూడో రౌండ్‌లో గాఫ్ 60, 62తో జయభేరి మోగించింది. తొమ్మిదో సీడ్ బార్బొరా క్రెజ్సికొవా (చెక్) కూడా నాలుగో రౌండ్‌లో ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్‌లో క్రెజ్సికొవా 46, 75, 63తో ఆస్ట్రేలియా క్రీడాకారిణి హంటర్‌ను ఓడించింది. కాగా, పదో సీడ్ హద్దాద్ మియా (బ్రెజిల్) మాత్రం మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.