మినార్, స్విటోలినా ముందుకు..
రూనె, రిబకినా ఔట్, ఆస్ట్రేలియా ఓపెన్
మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), 8వ సీడ్ ఎమ్మా నవ్వారో (అమెరికా) నాలుగో రౌండ్ జయకేతనం ఎగుర వేశారు. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), 28వ సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో జయభేరి మోగించారు. ఇవా లీస్ (జర్మనీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి స్వియాటెక్ అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే ఇగా చెలరేగి ఆడింది. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.
తర్వాతి సెట్‌లో కూడా దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోక విజయంతో ముందంజ వేసింది. మరో పోటీలో నవ్వారో 64, 57, 75తో రష్యాకు చెందిన కసట్కినాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో నవ్వారో విజయం సాధించింది. రెండో సెట్‌లో కూడా హోరాహోరీ తప్పలేదు. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో కసట్కినా జయభేరి మోగించింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా ఉత్కంఠ తప్పలేదు. ఈ సెట్ కూడా టైబ్రేకర్‌కు వెళ్లింది. ఇందులో పైచేయి సాధించిన నవ్వారో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కీస్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చక తప్పలేదు. మూడు సెట్ల పోరాటంలో 63, 16, 63తో రికబినా (కజకిస్థాన్)పై విజయం సాధించింది. మరో పోరులో స్విటోలినా 64, 61తో రష్యా క్రీడాకారిణి వెరోనికా కుదెర్‌మెటోవాను ఓడించింది. ఆరంభం నుంచే స్విటోలినా నిలకడగా ఆడింది. తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటనను ఎదుర్కొన్న తర్వాతి సెట్‌లో అలవోక విజయంతో ముందంజ వేసింది.
జన్నిక్ ముందంజ..
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో జన్నిక్ 63, 36, 63, 62తో హోల్గర్ రూనే (డెన్మార్క్)ను ఓడించాడు. తొలి సెట్‌లో జన్నిక్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. అయితే రెండో సెట్‌లో రూనే ఆధిపత్యం చెలాయించాడు. సిన్నర్‌ను కంగుతినిపిస్తూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి రెండు సెట్లలో సిన్నర్ దూకుడును ప్రదర్శించాడు. రూనేకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సునాయాస విజయంతో ముందంజ వేశాడు. మరో పోటీలో మినార్ 60, 76, 63తో అలెక్స్ మిఛెల్‌సన్ (అమెరికా)ను ఓడించాడు. ఇతర పోటీల్లో సొనేగో (ఇటలీ), షెల్టన్ (అమెరికా) జయకేతనం ఎగుర వేశారు.