Friday, January 24, 2025

టైటిల్ పోరుకు సబలెంక, కీస్

- Advertisement -
- Advertisement -

స్వియాటెక్, బడోసా ఇంటికి
ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ అరిన సబలెంక (బెలారస్), 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) ఫైనల్‌కు చేరుకున్నారు. రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), 11వ సీడ్ పౌలా బడోసా (స్పెయిన్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. బడోసాతో జరిగిన పోరులో టాప్ సీడ్ సబలెంకకు తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. సబలెంక నిలకడైన ఆటను కనబరిచినా బడోసా కూడా అద్భుత పోరాట పటిమతో అలరించింది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది.

ఇటు అరినా అటు బడోసా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. ఇద్దరు దూకుడును ప్రదర్శించడంతో ఆటలో ఉత్కంఠత తప్పలేదు. కానీ కీలక సమయంలో బడోసా తడబడింది. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సబలెంక సఫలమైంది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగిన అరినా సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం బడోసా పూర్తిగా చేతులెత్తేసింది. సబలెంకకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు తన మార్క్ షాట్లతో అలరించిన సబలెంక ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

స్వియాటెక్‌కు షాక్..

మరోవైపు టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా భావించిన ఇగా స్వియాటెక్‌కు సెమీఫైనల్లోనే చుక్కెదురైంది. మాడిసన్ కీస్‌తో జరిగిన పోరులో ఇగా పరాజయం చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కీస్ 57, 61, 76(10/6)తో ఇగాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు స్వియాటెక్, అటు కీస్ అద్భుత పోరాట పటిమను కనబరిచారు. ఎవరి సర్వీస్‌ను వారు కాపాడుకుంటూ ముందుకు సాగారు. ఇద్దరు సర్వం ఒడ్డడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన స్వియాటెక్ సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్‌లో కీస్ చెలరేగి ఆడింది. అద్భు షాట్లతో చెలరేగిన కీస్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు మళ్లీ ఉత్కంఠభరితంగా సాగింది.

ఇటు స్వియాటెక్ అటు కీస్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఇద్దరి మధ్య ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది. కానీ కీలక సమయంలో స్వియాటెక్ ఒత్తిడికి గురైంది. ఆటపై పట్టు తప్పిన ఇగా వరుసగా తప్పిదాలు చేసింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కీస్ సఫలమైంది. నిలకడైన ఆటతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగే టైటిల్ పోరులో టాప్ సీడ్ సబలెంకతో కీస్ తలపడుతుంది. ఇక శుక్రవారం పురుషుల సెమీ ఫైనల్ పోరు జరుగనుంది. టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) సెమీస్‌లో బెన్ షెల్టన్ (అమెరికా)తో తలపడుతాడు. మరో పోరులో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)తో మాజీ ఛాంపియన్, ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఢీకొంటాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News