Saturday, November 23, 2024

అందరి కళ్లు ఆస్ట్రేలియా ఓపెన్‌పైనే

- Advertisement -
- Advertisement -

Australian Open on feb 08

 

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను సజావుగా జరిపేందుకు టోర్నీ నిర్వాహకులు నడుంబిగించారు. కరోనా మహమ్మరి కారణంగా కిందటి ఏడాది పలు టెన్నిస్ టోర్నమెంట్‌లను రద్దు చేయడమే లేకుంటే వాయిదా వేయడమో జరిగింది. కరోనా దెబ్బకు చారిత్రక వింబుల్డన్ ఓపెన్‌ను పూర్తిగా రద్దు చేశారు. అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్ షెడ్యూల్‌లో మార్పు చేశారు. యూఎస్ ఓపెన్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించారు. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరిలో జరగాల్సిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను కూడా ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 8 నుంచి 21 వరకు టోర్నీ జరుగనుంది. కాగా ఈసారి టోర్నీలో స్టార్ ఆటగాళ్లందరూ పోటీ పడుతున్నారు. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్, రెండో సీడ్ రఫెల్ నాదల్, మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణిలు ఆశ్లే బార్టీ, సిమోనా హలెప్, నవోమి ఒసాకా, సెరెనా విలియమ్స్ తదితరులు బరిలోకి దిగుతున్నారు.

ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియాకు చేరుకుని క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నారు. బయోబబుల్ విధానంలో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు పరిమిత సంఖ్యలో అభిమానులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మరి పూర్తిగా తగ్గక పోవడంతో ఈ ఆంక్షలు విధించారు. ఇక టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పించడంపై టోర్నీ నిర్వాహకులు దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా జాగ్రత్తగా టోర్నీని నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ విజయవంతం అయితే తర్వాత జరిగే మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను మరింత ఆత్మవిశ్వాసంతో నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు పురుషుల విభాగంలో అటు మహిళల విభాగంలో అగ్రశ్రేణి స్టార్లు పోటీ పడుతున్నారు. నాదల్, జకోవిచ్‌లు ట్రోఫీపై కన్నేశారు.

నాదల్ ఈసారి టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇక అమెరికా మహిళా దిగ్గజం సెరెనా విలియమ్స్ కూడా అరుదైన రికార్డుకు టైటిల్ దూరంలో నిలిచింది. ఈసారి ఎలాగైన టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక ఆశ్లే బార్టీ, హలెప్, వోజ్నియాకి, ప్లిస్కోవా, క్విటోవా , ఒసాకా తదితరులు కూడా టైటిల్ సాధించడమే లక్షంగా పెట్టుకున్నారు. మరోవైపు సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కావడంతో అందరిదృష్టి ఆస్ట్రేలియా ఓపెన్‌పై పడింది. పూర్తి భిన్నమైన వాతావరణంలో ఈసారి టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇక టోర్నమెంట్‌ను సజావుగా జరుపడం నిర్వాహకులకు సవాలుగా తయారైంది. ఏమాత్రం పొరపాటు జరిగిన మొత్తం టోర్నీ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. దీంతో చాలా జాగ్రత్తల నడుమ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ జరుగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News