మూనీ అజేయ శతకం, రాణించిన మెక్‌గ్రాత్, పోరాడి ఓడిన భారత్
మాక్‌కె: భారత్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఆస్ట్రేలియాకు గట్టి పోటీని ఇచ్చినా మిథాలీ సేనకు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య ఆస్ట్రేలియా 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం దక్కించుకుంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. టీమిండియా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా వరుస క్రమంలో వికెట్లు తీశారు. దీంతో ఒక దశలో ఆస్ట్రేలియా 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఓపెనర్ బేత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. మూనీ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. మెక్‌గ్రాత్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో తనవంతు పాత్ర పోషించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మెక్‌గ్రాత్ 9 ఫోర్లతో 74 పరుగులు చేసింది.
ఈ క్రమంలో ఐదో వికెట్‌కు కీలకమైన 126 పరుగులు జోడించింది. తర్వాత వచ్చిన నికోలా కారేతో కలిసి మూనీ మరో వికెట్ పడకుండానే ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. కారే రెండు ఫోర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన మూనీ 12 ఫోర్లతో అజేయంగా 125 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అండగా నిలిచింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 11 ఫోర్లతో 86 పరుగులు చేసింది. రిచా ఘోష్ (44), గోస్వామి 28 (నాటౌట్) తదితరులు కూడా రాణించడంతో భారత్ స్కోరు 274 పరుగులకు చేరింది.