రేపటి నుంచి అమలు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా తమ సొంత పౌరులపైనే కఠిన నిబంధనలు విధించింది. భారత్‌లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లే ఆ దేశ పౌరులపై తాత్కాలిక నిషేధం విధించింది. సోమవారం నుంచి అది అమలవుతుందని తెలిపింది. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి వచ్చినవారిపై అత్యంత కఠిన శిక్షలు విధించనున్నట్టు పేర్కొన్నది. భారత్‌లో 14 రోజులపాటు ఉన్న పౌరులు ఆస్ట్రేలియాలో అడుగు పెడితే ఐదేళ్ల జైలుశిక్ష లేదా 66,000 ఆస్ట్రేలియా డాలర్లు(50,876 అమెరికన్ డాలర్లు) జరిమానా లేదా రెండూ విధించనున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
ఈ నిషేధాజ్ఞలపై మే 15న తమ దేశ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంఒ) సమీక్ష జరిపి నిర్ణయం తీసుకునేవరకూ అమలులో ఉంటాయని తెలిపింది. తమ దేశంలోకి వచ్చిన విదేశీయులకు నిర్వహించిన పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యమంత్రి గ్రెగ్‌హంట్ తెలిపారు. పాజిటివ్ వచ్చినవారికి క్వారంటైన్ వసతులు కల్పించడంలో ఇబ్బందులు కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 9000మంది ఆస్ట్రేలియా పౌరులు చిక్కుబడిపోయారని, వారిలో 600మందికిపైగా కరోనా బారినపడి ఉంటారన్నది ఆ దేశం అంచనా.