విండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గ్రూప్1లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ విండీస్‌కు ఈ మ్యాచ్‌లోనూ ఓటమి తప్పలేదు. టోర్నమెంట్ ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన విండీస్ అత్యంత చెత్త ఆటతో నిరాశ పరిచింది. ఐదు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి నాలుగింటిలో పరాజయం చవిచూసింది. ఇక విండీస్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత ఆటతో అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వార్నర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే మార్ష్‌తో కలిసి వార్నర్ స్కోరును ముందుకు నడిపించాడు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన వార్నర్ 56 బంతుల్లోనే 9 ఫోర్లు, మరో 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టులో కెప్టెన్ పొలార్డ్ (44), ఓపెనర్ లూయిస్ (29), హెట్‌మెయిర్ (27) మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.