Wednesday, January 22, 2025

భారతీయ కథా సాహిత్యం రేపెక్కడికెళ్తావ్!

- Advertisement -
- Advertisement -

సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది కథ. వచన సాహిత్యంలో కథ జీవితానికి దగ్గర కావడం వల్లనే అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. భారతీయ భాషల నుండి ఉత్తమమైన కథలను ఎన్నుకొని, వాటి అనువాదాలను ప్రస్తుత సంపుటిలో చేర్చిన డా.రూప్ కుమార్ డబ్బికార్ అభినందనీయులు. సాహితీ లోకానికి కవిగా పరిచయమైన వీరు ‘కవిత్వంలో ఇమడ్చలేని భావోద్వేగాలను కథారూపంలో చెప్పడానికి అప్పుడప్పుడు కథలను ఆశ్రయించానంటారు’. ఇందులోని కథలు చాలా వరకు భారతీయ భాషల నుండి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల కథలు, ఇతర సుప్రసిద్ధ కథకుల కథలను ఎన్నుకొని అనువదించారు. ఒరియా, అస్సామీ, పంజాబీ, గుజరాతి, మరాఠీ, డోగ్రి, కొంకణి, తమిళం, మలయాళం భాషలలోని ఉత్తమమైన కథల అనువాదాలు ఈ కథా సంకలనంలో ఉన్నాయి. ఎనిమిది మంది ప్రసిద్ధ రచయిత్రులు, ఏడుగురు ప్రముఖ రచయితలతో, ఎనిమిది కథాంశాలు మహిళా ప్రధానంగా కొనసాగినవి.

మానవ సంబంధాలు, సామాజిక వివక్ష, జాతి విధ్వంసాలు, దేశ విభజన వలన ఏర్పడ్డ ప్రజాజీవనం, పురుషాధిక్య సమాజంలో మహిళల అగచాట్లు, అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమాజాన్ని రచయిత కథలలో ప్రతిబింబింప చేశారు.
జమ్మూకాశ్మీర్‌లోని ‘డోగ్రీ’ భాషలో ఆధునిక సాహిత్య రచనలు చేసిన మొదటి రచయిత్రి పద్మ సచ్దేవ్. ‘రేపెక్కడికెళ్తావ్..!’ కథలో ‘ప్రీతో’ అనే పేద యువతి జీవితం తాగుబోతు భర్త వలన ఛిన్నాభిన్నం అవుతుంది. ఇద్దరు స్నేహితురాళ్ళు ఆమెను చేరదీసినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి కలిగిన సంశయం ‘రేపు ఎక్కడికెళ్తావంటూ..!’ ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే తీరును కథలో చూస్తాము. ఈ కథ ‘రంగనాథ రామచంద్ర రావు’ అనువాదం ‘భారతీయం’ కథాసంకలనంలోనూ చోటు దక్కించుకున్నది.

ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ‘ఇస్మత్ చుగ్తాయి’ కథ ‘అస్తిత్వాల మూలాలు’. ‘మన దేశం అంటే ఎవడబ్బ సొత్తు అది. మనుషులు ఎక్కడ ఉంటే అదే వారి దేశం. ఏ నేల మీద పుట్టామో ఏ మట్టిలో పొర్లాడి పెరిగి పెద్దయ్యామో./ అదే మన దేశం కాకపోతే మరి కేవలం ఓ నాలుగు రోజుల కోసం ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ బతుకుదెరువు వెళ్లదీసే ఆ నేల మన దేశమై పోతుందా? ఇంకా ఎవరికి తెలుసు, అక్కడి నుంచి కూడా ఎవరైనా తరిమేస్తే లాంటి వాక్యాలు కథలో పుట్టిన నేల మీద మమకారాన్ని తెలియజేస్తాయి. దేశ విభజన తర్వాత అన్యోన్యంగా ఉండే హిందూ, ముస్లిం కుటుంబాల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలను, చివరికి వారి కుటుంబాలలో ఆనందం వెల్లివిరయడానికి గల సరియైన ఆలోచన ధోరణి ఈ కథలో చూస్తాము. ఇలాంటిదే మరో హిందీ కథ ‘పేగు తెగిన దుఃఖం!’. హిందీ సుప్రసిద్ధ రచయిత ‘డాక్టర్ మోతిలాల్ జోత్వాని’ సింధిలో ఉన్న ఈ కథను హిందీలో అనువదించారు.

ఒక రచయిత అస్తిత్వవేదన, జన్మభూమి మీద మమకారం కథలో చిత్రీకరించబడినది. దళిత సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రచయిత ‘ఓం ప్రకాష్ వాల్మీకి’. ‘శవయాత్ర’ కథలో.. ‘బల్హర్’ అనే దళిత కుటుంబం పట్ల గ్రామ ప్రజలు చూపిన వివక్ష కారణంగా, ఆ కుటుంబంలో చిన్న పిల్ల చావుకు కారణమవుతుంది. ఆ పిల్ల శవాన్ని తాకడానికి, శవయాత్రలో పాల్గొనడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. ‘అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళిచ్చే ఉపన్యాసాలు అతనికి గుర్తుకు వచ్చాయి. వారి ఆదర్శాలు, ఆలోచనా ధోరణుల డొల్లతనం అతన్ని బాధించాయి. వీరి ఉపన్యాసాలు, ఆదర్శాల్లో అంతా డొల్లతనమే, కృత్రిమత్వమే’ లాంటి వాక్యాలు వారి నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. ఇదే కోవకు చెందిన మలయాళ కథ ‘చెమట గుర్తులు’. మలయాళ భాషలో ప్రముఖ కథ, నవలా రచయిత్రి ‘సారా జోసెఫ్’ అందించారు. ఈ కథలో.. నిమ్నకులానికి చెందిన అమ్మాయి మెరిట్లో ఉత్తీర్ణురాలైనా, కాలేజీ అడ్మిషన్‌లో రిజరవ్డ్ లిస్టులో పెడతారు. అందుకు కారణం ఇతర విషయాలు అనగా వంశం, కులం, మతం, రంగు, భాష, దుస్తులు అని తెలుసుకుంటుంది. కమిటీ ద్వారా తనకు అన్యాయం జరిగిందని భావిస్తుంది. ఆ అమ్మాయి ధైర్యం, చొరవను ‘చెమట గుర్తులు’ కథలో చూస్తాము. ప్రఖ్యాత అస్సామీ రచయిత్రి ‘ఇందిరా గోస్వామి’ కథ ‘ప్రయాణం’.

ఈశాన్య ప్రాంతాలలోని మిలిటెంట్ల కారణంగా ఆ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న కొన్ని సంఘటనలు, అనుభవా లను కథలో దృశ్యమానం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి అస్సాంకు వెళ్లే ఇద్దరు ప్రొఫెసర్ల ప్రయాణంలో ఈ విషయాలను కథన రీతిలో మలచిన తీరు అద్భుతం. బిజులీ వెదురు తోపులు, చిట్యన్, వేల్, బార్నియా వృక్షాలు, సాయంకాలపు గాఢత, సిల్క్ వస్త్రపు ముక్కలుగా ముక్కలుగా వృక్షాలను కప్పడం, ఆకుల సందుల్లోంచి చుక్కలు చుక్కలుగా రాలిపడిన సూర్యకాంతి, జింక చర్మాన్ని పోలి మంత్రముగ్ధుల్ని చేయటం, సాంప్రదాయపు దొతారా వాయిద్యం మొదలగు నూతన విషయాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత్రి, సామాజిక కార్యకర్త ‘మహా శ్వేతాదేవి’ రచించిన కథ ‘ద్రౌపది’. జమీందారీల ఆదిపత్యం, సంతాల్ తెగకు చెందిన ఆదివాసి మహిళపై పోలీసుల చిత్రహింసలు, హృదయ విదారక దృశ్యాలు చిత్రించారు.

సుప్రసిద్ధ ఒరియా రచయిత్రి ప్రతిభా రాయ్ రాసిన కథ ‘పాదుకల పూజ’. లోకం పోకడ తెలియని బాబాయ్ ప్రేమకు గుర్తుగా ‘విధాన్’ బాబాయి పాదుకలను పూజిస్తుంటాడు. దాని వెనుక ఆంతర్యమేమనగా ‘విధాన్’ ఉన్నతికి కారణమైన బాబాయ్ బ్రతికి ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా ఉంటాడు. ‘పెద్దయ్యాక చెప్పులు కొనిస్తానని మాట ఇస్తాడు’ విధాన్. ఉద్యోగం వచ్చాక విధాన్, బాబాయికి చెప్పులు కొనిస్తాడు. కానీ అవసాన దశలో వాటిని తొడుక్కోలేని స్థితిలో ఉండి చనిపోతాడు. బాబాయ్ పట్ల ప్రేమ, కృతజ్ఞతా భావాన్ని పాదుకల పూజలో రచయిత్రి దృశ్యమానం చేశారు. ‘మగాడు ఏ పనుల వల్ల రెండు రూకలు సంపాదించలేడో, అతను చేసే పనిని శ్రమ కింద లెక్క కట్టదు సమాజం’ లాంటి జీవిత సత్యాలను కథలో చూస్తాము. ప్రముఖ కొంకణి కథా రచయిత్రి మీనా కాకోడ్కర్ కథ ‘ఓ నా చిట్టి తండ్రీ’. తల్లిని కోల్పోయిన పిల్లవాణ్ణి చిన్నమ్మ తన ఇంటికి తీసుకెళ్తుంది. తండ్రితో గడిపిన రోజులు, తల్లి జ్ఞాపకాలు పిల్లవాణ్ణి కలచివేస్తాయి. కొద్ది రోజులకు తండ్రి గురించి బెంగ, సవతి తల్లి కథలు ఒకింతభయానికి గురిచేస్తాయి.

తండ్రి రాగానే కనబడిన సంబరం, సవతి తల్లి వస్తుందని తెలిసి ఆవిరవుతుంది. ‘ఇక్కడే పడుకోనీ అతన్ని, ఒంటరిగా వున్న నన్ను ఈ ఖాళీ గుడిసె తినేస్తోంది. ‘చిన్ని బట్టల నుంచి మంచి పూల పరిమళం రాసాగింది. కానీ అమ్మ బట్టలు ఎప్పుడూ పొగ చూరిన వాసన కొట్టేవి. చిన్ని బట్టలు కూడా, అలా పొగ చూరిన వాసన వేస్తే ఎంత బాగుండేది అన్న కోరిక పసి మనసుకి కలిగింది’ ఇలాంటి వాక్యాలు మనల్ని కన్నీటి పర్యంతమొందిస్తాయి.

సికింద్రాబాద్‌లో జన్మించిన తమిళ రచయిత అశోకమిత్రన్ కథ ‘రక్తం ఓడుతున్న గాయం’. ఇద్దరు ప్యాసింజర్ల మధ్య అనుకోకుండా జరిగిన సంఘటన అపార్థానికి కారణమవుతుంది. చివరికి ఆ ఇద్దరి మానసిక సంఘర్షణ చదువరులను ఆలోచింపచేస్తుంది. హిందీ ఉర్దూ సాహిత్య రంగంలో గొప్ప రచయిత మున్షీ ప్రేమ్ చంద్. వీరి కథ ‘జులూస్’. జులూస్ అంటే ఉద్యమకారులు చేసే ఊరేగింపు. ఈ కథ అనేక ఉద్యమకారుల నేపథ్యంతో రూపొందినది. తొలితరం స్త్రీవాద ఉర్దూ రచయిత్రి రషీద్ జహాన్ కథ ‘ఢిల్లీ సందర్శన’. కథలో ఢిల్లీ సందర్శనకని భార్యని వెంట తీసుకెళ్తాడు.

రైలు ప్లాట్ ఫామ్ మీద భార్యను ఒంటరిగా వదిలి, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాడు. భర్త నిర్లక్ష్య ధోరణి, ఒంటరిగా ఉన్న మహిళల పట్ల మగవాళ్ళ ప్రవర్తన, చివరికి విసుగు చెందిన భార్య ఢిల్లీ సందర్శన చేయకుండా తిరిగి వెళ్ళిపోదాం అనడంతో కథ ముగుస్తుంది. ప్రముఖ మరాఠీ రచయిత నారాయణ గణేష్ గోరే అందించిన కథ ‘గుక్కెడు నీళ్లు.. పిడికెడు రక్తం..’. మతవిద్వేషాల పర్యవసానం కథలో చూస్తాము. ఈ కథా సంకలనంలో వృద్ధాప్యంలో మాతృభూమిని వీడనంటూ మొరాయించే వృద్ధ మనసులను, జీవితంలో మోసపోయి స్వతంత్రత కోసం పాకులాడే స్త్రీని, కన్నతల్లి ప్రేమ కోసం వెతుకులాడే పిల్లవాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి తెగువ చూపే అమ్మాయిని, అందమైన అస్సామడవుల్లో మిలిటెంట్ల దురాగతాల్ని, మహానగరంలోని కరెంటు దీపాల కాంతిలో వైయక్తికమైన వ్యక్తిగత జీవితం అనే దుప్పటి కప్పుకుని తిరిగే మనుషులను చూసి ఆలోచిస్తాము, ఒకింత ఉద్వేగానికి లోనవుతాం. భారతీయ సమాజంలోని సమకాలీన సామాజిక జీవనానికి ఈ కథలు ప్రతిబింబాలు. సుప్రసిద్ధ కథకుల కథలను తెలుగులో అనువదించిన రచయిత డాక్టర్ రూప్ కుమార్ డబ్బికార్ అభినందనీయులు.

లేదాళ్ళ జయ
8790182908

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News